ధాన్యలక్ష్మి అమ్మవారికి విశేష పూజలు | - | Sakshi
Sakshi News home page

ధాన్యలక్ష్మి అమ్మవారికి విశేష పూజలు

Oct 17 2026 3:09 AM | Updated on Oct 17 2026 3:09 AM

ధాన్యలక్ష్మి అమ్మవారికి విశేష పూజలు మిర్చి యార్డుకు నాలుగు రోజులు సెలవులు ముగిసిన బాస్కెట్‌బాల్‌ పోటీలు రూ.50 లక్షలతో వాసవీ అమ్మవారికి ప్రత్యేక అలంకరణ

తాడేపల్లి రూరల్‌: తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరం విజయకీలాద్రి దివ్య క్షేత్రంపై ధాన్యలక్ష్మి అమ్మవారికి శుక్రవారం విశేష పూజలు నిర్వహించారు. ధాన్యలక్ష్మి అమ్మవారికి ఉదయం అభిషేక మహోత్సవం, కుంకుమార్చన శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం అమ్మవారి శ్రీయాగం వైభవంగా జరిగింది. సాయంత్రం 5.30 గంటలకు శ్రీవిష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం, ధాన్యలక్ష్మి అమ్మవారికి పల్లకీ సేవ, అర్చన, నివేదన, మంగళాశాసనం కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ధాన్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. జీయర్‌ ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌ మేనేజర్‌ పురాణం వెంకటాచార్యులు మాట్లాడుతూ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్‌స్వామి వారి మంగళాశాసనాలతో శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

కొరిటెపాడు (గుంటూరు): గుంటూరు మిర్చి యార్డుకు శనివారం నుంచి ఈ నెల 20వ తేదీ వరకు వరుసగా నాలుగు రోజులు సెలవులు ప్రకటించినట్లు ఉన్నత శ్రేణి కార్యదర్శి ఎ.చంద్రిక శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. శని, ఆదివారాలు సాధారణ సెలవులు కాగా.. వ్యాపారులు, కార్మికుల అభ్యర్థన మేరకు సోమవారం కూడా సెలవు ప్రకటించినట్లు పేర్కొన్నారు. మంగళవారం దసరా పండుగ సందర్భంగా యార్డుకు సెలవు ఉంటుందని తెలిపారు. బుధవారం నుంచి మిర్చియార్డులో వ్యాపార లావాదేవీలు యథావిధిగా కొనసాగుతాయన్నారు.

గుడివాడ టౌన్‌: స్థానిక ఎన్టీఆర్‌ స్టేడియంలో నిర్వహిస్తున్న బాస్కెట్‌బాల్‌ పోటీలు గురువారం రాత్రి ముగిశాయి. మహిళా విభాగంలో తూర్పు గోదావరికి చెందిన రామచంద్రాపురం టీమ్‌ ప్రథమ స్థానం, ఏలూరు జిల్లాకు చెందిన ఏలూరు టీమ్‌ ద్వితీయ స్థానం, పల్నాడు జిల్లాకు చెందిన పల్నాడు టీమ్‌ తృతీయ స్థానం సాధించాయి. పురుషుల విభాగంలో గుంటూరు జిల్లాకు చెందిన కేఎల్‌ యూని వర్సిటీ టీమ్‌ ప్రథమ స్థానం, రాజమండ్రి జిల్లాకు చెందిన సీబీసీ రాజమండ్రి టీమ్‌ ద్వితీయ స్థానం, హెచ్‌ ఫౌండేషన్‌ టీమ్‌ తృతీయ స్థానం సాధించినట్లు నిర్వాహకులు తెలిపారు.

బాపట్ల: బాపట్ల పట్టణంలోని కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారికి రూ.50 లక్షల కరెన్సీతో ప్రత్యేక అలంకరణ చేపట్టారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు కొత్తమాసు సత్యనారాయణ ఆధ్వర్యంలో నూతన నోట్లతో ఈ విశేష అలంకరణ చేపట్టారు. శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా అమ్మవారు సరస్వతీ దేవి అలంకరణలో భక్తులకు ప్రత్యేక దర్శనమిచ్చారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైష్ణవి బృందం వారు ప్రదర్శించిన భరతనాట్యం, కూచిపూడి నృత్య ప్రదర్శనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement