చిలకలూరిపేట: పల్నాడు జిల్లా చిలకలూరిపేట మున్సిపల్ చైర్మన్ ఎన్నిక కూటమిలో కుంపటి రాజేసింది. ఇక్కడ టీడీపీకి చెందిన మాజీ మంత్రి, నాలుగో పర్యాయం ఎమ్మెల్యేగా ప్రత్తిపాటి పుల్లారావు వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో చైర్మన్ పదవి తమ పార్టీకే దక్కుతుందని ఆ పార్టీ వర్గీయులు భావిస్తూ వచ్చారు. చైర్మన్, కౌన్సిలర్లుగా ఎవరు ఉండాలనే లెక్కలు వేసుకుంటూ వచ్చారు. చైర్మన్ పీఠాన్ని జనసేనకు ఖరారు చేయడం టీడీపీ ఆశావహులలో అసంతృప్తి, ఆగ్రహావేశాలకు కారణమైంది. టీడీపీలోని ఓ వర్గం చైర్‌పర్సన్‌గా తమకే అవకాశం కల్పించాలని స్థానిక నాయకత్వం ముందు బలంగా వాదించింది. పైగా పార్టీ నిర్ణయం పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేసినట్లు ఆ పార్టీ వర్గీయులే చెబుతున్నారు. టీడీపీ ఎమ్మెల్యే ఉన్న చోట చైర్మన్ పదవి జనసేనకు ఎలా ఇస్తారని అసంతృప్తి వ్యక్తం చేసినట్లు ప్రచారం సాగుతోంది. టీడీపీకే అత్యధిక కౌన్సిలర్ స్థానాలు లభించినా ప్రయోజనం ఏంటని ఆ పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.
జనసేనలో మూడు ముక్కలాట...
ఇటు జనసేనలో టికెట్ ముసలం మొదలైంది. సీటు దక్కిందన్న సంతోషం నేతలకు కొద్దిసేపైనా నిలవని పరిస్థితి నెలకొంది. టికెట్ కోసం అంతర్గత పోరు భగ్గుమంది. జనసేన నరసరావుపేట పార్లమెంట్ సమన్వయకర్తల్లో ఒకరైన మండలనేని చరణ్‌తేజ తల్లి పద్మ పేరు తెరపైకి వచ్చింది. నామినేషన్ వేయడమే తరువాయి అని ప్రచారం జరిగింది. హైదరాబాద్‌లో స్థిరపడిన పారిశ్రామికవేత్త బైరా దిలీప్ చక్రవర్తి భార్య డాక్టర్ పావని పేరు కూడా తెరపైకి వచ్చింది. దిలీప్ చక్రవర్తి కాపు, పావని కమ్మ సామాజిక వర్గం కావడంతో కలిసి వచ్చే అంశమని ప్రచారం చేసుకుంటున్నారు. జనసేన నియోజకవర్గ సమన్వయకర్త తోట రాజారమేష్ కూడా టికెట్ తన భార్య రాజరాజేశ్వరికే ఇవ్వాలని పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. పార్టీ కోసం తాను ఎంతో కష్టపడ్డానని అధిష్ఠానాన్ని, టికెట్ ఇవ్వాలని గట్టిగా నిలదీస్తున్నట్లు సమాచారం. పార్టీ సింబల్‌తో మూడు వర్గాల వారూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేసుకుంటున్నారు.


