ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు | - | Sakshi
Sakshi News home page

ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు

Oct 17 2026 3:09 AM | Updated on Oct 17 2026 3:09 AM

జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వి.వినోద్‌ కుమార్‌

బాపట్ల: జిల్లాలో స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కఠినంగా అమలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వి. వినోద్‌ కుమార్‌ తెలిపారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్‌ హాల్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల షెడ్యూల్‌, ఏర్పాట్లు, ప్రవర్తనా నియమావళి అమలు తదితర అంశాలను వివరించారు. చీరాల, రేపల్లె మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. బాపట్ల మున్సిపాలిటీకి కోర్టు కేసు కారణంగా ఎన్నిక నిలిచిందన్నారు. అధికారులకు ఇప్పటికే శిక్షణ ఇచ్చినట్లు వెల్లడించారు. జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ భావనా వశిష్ట ఆధ్వర్యంలో ఆర్‌డీవోలు, మండల స్థాయిలో తహసీల్దార్లు నియమావళి అమలును పర్యవేక్షిస్తారని తెలిపారు. ప్రభుత్వ అధికారులు రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనకూడదని చెప్పారు. ఎన్నికల నియమావళికి విరుద్ధంగా కొత్త ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, ప్రచార కార్యక్రమాలు నిర్వహించకూడదని స్పష్టం చేశారు. ఇప్పటికే ప్రారంభమైన అభివృద్ధి పనులను సంబంధిత ఎన్నికల మార్గదర్శకాలకు అనుగుణంగా కొనసాగించవచ్చని తెలిపారు. రాజకీయ ప్రకటనలు, ప్రచార సామగ్రి విషయంలో నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. అవసరమైన అనుమతులు పొందిన తర్వాతే ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఉదయం పోలింగ్‌ నిర్వహించి, అదే రోజు మధ్యాహ్నం ఓట్ల లెక్కింపు చేపడతామన్నారు. వెంటనే ఫలితాలను ప్రకటించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

ఏర్పాట్లు ముమ్మరం

ఎన్నికల నిర్వహణకు రిటర్నింగ్‌ అధికారులు, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులు, పోలింగ్‌ సిబ్బందిని నియమించినట్లు కలెక్టర్‌ చెప్పారు. ఇప్పటికే మూడు విడతల శిక్షణ పూర్తయిందని, ఓట్ల లెక్కింపు వరకు అవసరమైన తదుపరి శిక్షణ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తామని తెలిపారు. చీరాల, బాపట్ల, రేపల్లెల్లో రిసెప్షన్‌, డిస్ట్రిబ్యూషన్‌, స్ట్రాంగ్‌ రూమ్‌, కౌంటింగ్‌ కేంద్రాల ఏర్పాట్లు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఎన్నికల నిర్వహణను పర్యవేక్షించేందుకు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిని జిల్లా ఎన్నికల పరిశీలకుడిగా నియమించనున్నట్లు తెలిపారు. పోలీసు బందోబస్తు, శాంతిభద్రతల పర్యవేక్షణకు గుంటూరు రేంజ్‌ పరిధిలో ఐజీ స్థాయి అధికారి పర్యవేక్షణ ఉంటుందని పేర్కొన్నారు.

ఓటర్లు జాబితాలను పరిశీలించాలి

ఓటర్లు తమ పేర్లు ఉన్నాయో లేదో ముందుగానే ఆయా జాబితాలను పరిశీలించుకోవాలని కలెక్టర్‌ సూచించారు. మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించిన జాబితాలను ప్రచురించినట్లు తెలిపారు. ఎంపీటీసీ ఎన్నికల్లో గులాబీ బ్యాలెట్‌ పత్రం, జెడ్పీటీసీ ఎన్నికల్లో తెల్ల బ్యాలెట్‌ పత్రం ఉంటాయని చెప్పారు. అందరూ ఓటింగ్‌ విధానంపై అవగాహన పెంచుకోవాలని కోరారు.

ఫిర్యాదులకు ప్రత్యేక వ్యవస్థ

జిల్లాలో ఎక్కడైనా ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలు చోటుచేసుకుంటే ప్రజలు కలెక్టరేట్‌ కంట్రోల్‌ రూమ్‌తోపాటు రెవెన్యూ డివిజన్‌ స్థాయి అధికారులకు ఫిర్యాదు చేయాలని కలెక్టర్‌ సూచించారు. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, బాధ్యులపై చర్యలు తీసుకుంటారని తెలిపారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రజలు, రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, అధికారులు సహకరించాలని కలెక్టర్‌ విజ్ఞప్తి చేశారు.

ఎన్నికల ఏర్పాట్ల పరిశీలన

జిల్లా పరిషత్‌, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి అవసరమైన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వి.వినోద్‌ కుమార్‌ పరిశీలించారు. శుక్రవారం బాపట్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్నికల నిర్వహణ కోసం ఏర్పాటు చేయనున్న స్ట్రాంగ్‌ రూమ్‌లు, ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాలు, ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఆయన పరిశీలించారు. సామగ్రిని సక్రమంగా పంపిణీ చేసే ఏర్పాట్లు, పోలింగ్‌ అనంతరం బ్యాలెట్‌ బాక్సులను భద్రపరిచే స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద భద్రతా చర్యలు, ఓట్ల లెక్కింపు కోసం అవసరమైన వసతులు, సిబ్బందికి కల్పించాల్సిన సౌకర్యాలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఎన్నికల ప్రక్రియకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని సూచించారు. భద్రత, పారదర్శకతకు ప్రాధాన్యతనిస్తూ నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలన్నారు. జిల్లా కలెక్టర్‌ వెంట జెడ్పీ సీఈవో సి.హెచ్‌.విజయలక్ష్మి, బాపట్ల ఆర్‌డీవో ఎ.హరికుమార్‌, మున్సిపల్‌ కమిషనర్‌ ఎం.హాసిని, తహసీల్దార్‌ షేక్‌ సలీమా, మండల సర్వేయర్‌ తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement