జిల్లాలో 1,13,902 హెక్టార్లకు 53,774 మాత్రమే సాగు వాటిల్లోనూ 30 శాతానికిపైగా ఎండిపోయిన పంట 70 శాతానికిపైగా లోటు వర్షపాతం బీడు భూములను తలపిస్తున్న పొలాలు
ఎండిన 4 ఎకరాలు
మేఘాల దోబూచులాటలు.. అప్పుడప్పుడు రెండు ఉరుములు.. మూడు మెరుపులు.. ఆపై ఎప్పుడో ఒకసారి నాలుగు చినుకులు.. పగలంతా భానుడి భగభగలు.. ఖరీఫ్ సీజనంతా కనిపించిన వాతావరణం ఇది. ‘ఎల్‌నినో’ ప్రభావంతో వర్షాభావం.. దీనికితోడు టీడీపీ ప్రభుత్వ తీవ్ర నిర్లక్ష్యం.. వెరసి పంట సాగుకాక పుడమి తల్లి బోసిపోయింది. రైతును కరువు ముంగిట వదిలేసి ఖరీఫ్ నిరాశగా ముగుస్తోంది.
బాపట్లటౌన్: ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల కారణంగా రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా పెట్టుబడులు, నీటికోసం ఖర్చు పెంచాల్సి వస్తోంది. అప్పుడప్పుడు కురిసిన అరకొర వర్షాలతో రైతులు వరిసాగుకు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం వర్షాలు లేకపోవడం, కాలువల ద్వారా సరిపడా సాగునీరు సరఫరా కాకపోవడంతో ఎండిపోతున్న పైర్లను కాపాడేందుకు రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. ఇప్పటికే నాట్లు, కలుపుమందులు, ఎరువులు చల్లినా నీరు లేక పైరు మొత్తం ఎండిపోతోందని, కనీసం మోటార్ల సహాయంతో కూడా నీరు పెట్టే అవకాశం లేని రైతులు కళ్లముందే మాడిపోతున్న పైర్లను ఎలా కాపాడుకోవాలో వారికి తెలియక తలలు పట్టుకుంటున్నారు.
పెరిగిన ఖర్చులు
ప్రతి ఏడాది జూన్.. జూలై మాసంలో వచ్చిన తొలకరి వర్షాల తర్వాత కాలువలకు సాగునీరు విడుదల చేసేవారు. రైతులు సకాలంలో నాట్లు వేసుకొని పొలాలకు నీరు అందించేవారు. ఇప్పుడు నీరు లేకపోవడంతో వెద పద్ధతిలో సాగుచేసిన పైర్లు ఎండుమొహం పట్టి పూర్తిగా దెబ్బతిన్నాయి. వాటి స్థానంలో ఇటీవల కురిసిన వర్షాలకు పొలాల్లో నీళ్లు పడటంతో అధిక ధరలు చెల్లించి నార్లు కొనుగోలు చేశారు. నీరు లేక అవి కూడా ఎండిపోతున్నాయి. రూ.వేలు ఖర్చు చేసి పెట్టిన నీళ్లు ఒక్కరోజులోనే భూమిలో ఇంకిపోవడంతో ఇలాంటి పరిస్థితి గతంలో ఎన్నడూ చూడలేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రైతుకు భరోసా కరువు
కూటమి సర్కార్ పాలనలో రైతుకు భరోసా కరువైంది. గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతులు చెల్లించాల్సిన క్రాప్ ఇన్సూరెన్స్‌ను రైతుల తరఫున ప్రభుత్వమే చెల్లించేది. ప్రస్తుతం రైతులే చెల్లించుకోవాలని టీడీపీ పాలకులు చెబుతున్నారు. దీంతో ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల్లో అసలు సాగు దెబ్బతింది. ఈ పరిస్థితిలో సగానికి పైగా రైతులు క్రాప్ ఇన్సూరెన్స్ చేయించుకోలేదు. పంటలు మొత్తం ఎండిపోతున్నా టీడీపీ ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదు.
మాది కర్లపాలెం మండలం, చింతాయపాలెం గ్రామం. నాకున్న మూడు ఎకరాలతోపాటు మరో నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నా. ప్రతి ఏడాదిలానే ఈ ఏడాది కూడా వెద పద్ధతిలో ఏడు ఎకరాలు వెద పెట్టాను. వర్షాలు పడకపోవడం.. కాలువల్లో నీరు రాకపోవడంతో మొక్క మొలిచి పైర్లు పూర్తిగా ఎండిపోయాయి. ఒక్కో ఎకరాకు ఐదుసార్లు దుక్కికి రూ.5,000, వెద పెట్టినందుకు రూ.1,500, గట్లు వేసినందుకు రూ.1,000 చొప్పున ఏడు ఎకరాలకు రూ.52,500 ఖర్చు పెట్టాను. సకాలంలో నీళ్లు లేని కారణంగా పైర్లు మొత్తం ఎండిపోయాయి. చేసేది ఏమీలేక నాలుగు ఎకరాలు పూర్తిగా వదిలేశాను. మిగిలిన పొలంలో మోటార్ల ద్వారా నీళ్లు పెట్టినా పరిస్థితి ఆశాజనకంగా లేదు.
– రావిపూడి వెంకటనారాయణ, చింతాయపాలెం


