‘స్థానిక’ ఎన్నికల స్టంట్‌గా పింఛన్ దరఖాస్తుల స్వీకరణ
అక్టోబర్ వచ్చినా కొత్త పింఛన్లపై స్పందించని టీడీపీ ప్రభుత్వం అధికారపార్టీ నేతల వసూళ్లు పల్నాడు జిల్లాలో 62,866 మంది ఎదురుచూపు
సత్తెనపల్లి: ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలులో చంద్రబాబు ప్రభుత్వం అనుసరిస్తున్న కాలయాపన విధానం ఇప్పుడు నిరుపేదలైన వృద్ధులు, వితంతువుల పాలిట శాపంగా మారింది. అక్టోబర్ ఒకటో తేదీ నుంచి కొత్తగా పింఛన్లు మంజూరు చేస్తామని ఆర్భాటంగా ప్రకటించిన పాలకులు.. తీరా గడువు ముగిసినా నేటికి ఆ ఊసే ఎత్తడం లేదు. కనీసం అధికారులకు ఎలాంటి విధి విధానాలు కూడా జారీ చేయకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో దరఖాస్తు చేసుకున్న వేలాదిమంది నిరుపేదలకు అసలు పింఛన్ అందుతుందా? లేదా కూటమి ప్రభుత్వం మళ్లీ మొండి చేయి చూపుతుందా అన్న ప్రశ్నలకు సమాధానం దొరకటం లేదు.
అసంతృప్తి చల్లార్చేందుకే...
చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 27 నెలలు కావస్తున్నా .. రాష్ట్రంలో ఒక్కటంటే ఒక్క కొత్త పింఛన్ ఇచ్చిన పాపాన పోలేదన్న విమర్శలు పెద్ద ఎత్తున వినిపించాయి. దీంతో అటు జనంతో పాటు ఇటు అధికార పార్టీ నాయకుల్లోనూ తీవ్ర అసహనం వ్యక్తం అవుతోంది. ఎక్కడికెళ్లినా పేదలు పింఛన్ల కోసం పాలకులను నిలదీస్తున్నారు. పీజీఆర్‌ఎస్ అర్జీలలో గాని, ఎమ్మెల్యేలు నిర్వహించే ప్రజాదర్బార్‌లలో గాని అత్యధికులు పింఛన్లు ఎప్పుడిస్తారంటూ నిలదీస్తుండడంతో అధికార పార్టీ నేతలు ప్రజల్లోకి తిరగలేక లోలోన మదనపడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల్లో పెరుగుతున్న తీవ్ర అసంతృప్తిని చల్లపరచటానికి హఠాత్తుగా అక్టోబర్ ఒకటో తేదీ నుంచి కొత్త పింఛన్లు ఇస్తున్నట్లు చంద్రబాబు ప్రభుత్వం నాటకానికి తెరలేపింది. ప్రభుత్వ ఆర్బాట ప్రకటనలతో వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, డప్పు కళాకారులు, చర్మకారులు ఆశగా దరఖాస్తు చేసుకున్నారు.
62,866 దరఖాస్తులు స్వీకరణ
జిల్లావ్యాప్తంగా వివిధ రకాల పింఛన్ల కోసం గ్రామీణ ప్రాంతాల నుంచి 49,670 మంది, పట్టణ ప్రాంతాల నుంచి 13,196 వెరసి మొత్తం 62,866 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో 55,485 దరఖాస్తులు ఆమోదించగా 7,311 దరఖాస్తులు తిరస్కరించారు. వివిధ స్టేజీల్లో 70 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. దరఖాస్తుల ప్రక్రియ ముగిసిన నేపఽ ద్యంలో ఇదే అదునుగా జిల్లాలో పచ్చ పార్టీ శ్రేణులు కొందరు దళారుల అవతారమెత్తి ‘పింఛన్ మంజూరు చేయిస్తాం’ అంటూ అమాయక ప్రజల నుంచి రూ.వేలు ముక్కుపిండి వసూలు చేస్తున్నారన్న విమర్శలు క్షేత్రస్థాయిలో వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే క్షేత్రస్థాయిలో వెరిఫికేషన్ ప్రక్రియ కూడా పూర్తయినట్లు చెబుతున్నప్పటికీ నిర్దేశిత గడువు ముగియగానే పింఛన్ల పోర్టల్ ప్రభుత్వం మూసివేసింది. ఏమైనా వివరాలు తెలుసుకోవాలన్నా అవకాశం లేకుండా చేసింది. మరోవైపు అక్టోబర్ నెల వచ్చేసినా ఇంతవరకు కొత్త పింఛన్లపై తమకు ఎలాంటి సమాచారం గాని, అధికారిక ఆదేశాలు గాని అందలేదని సంబంధిత శాఖ అధికారులు చేతులు ఎత్తేస్తున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల కోసమేనా?
జిల్లాలోని 28 మండలాలు, 8 మున్సిపాలిటీల నుంచి భారీగా వచ్చిన దరఖాస్తులను మండలాల్లో ఎంపీడీఓలు, పట్టణాల్లో మున్సిపల్ కమిషనర్లు నిర్దాక్షిణ్యంగా వడపోత నిర్వహించినట్లు సమాచారం. బడ్జెట్ కోతలు, నిధులు కొరత నెపంతో సామాజిక భద్రత పింఛన్లపై తీవ్రమైన కోత విధించేందుకు తెరవెనుక కసరత్తు జరుగుతోంది. సుప్రీంకోర్టు తీర్పుతో త్వరలో మున్సిపల్ ఎన్నికలు, ఆ తర్వాత జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికలు రానుండడంతో ఓట్ల కోసం ఈ ప్రకటన చేసినట్లు ప్రచారంలో ఉంది. ఇందులోనూ కఠినమైన ‘సిక్స్ స్టెప్ వాలిడేషన్’ వడపోత చాలదన్నట్లు.. దీనికి అదనంగా ‘సెవెన్త్ స్టెప్ వాలిడేషన్’ (పచ్చ పార్టీ వారి కోసం) అనే అలిఖిత నిబంధనను తెరపైకి తెచ్చి కేవలం తమ పార్టీ వర్గాలకే పింఛన్లు దోచి పెట్టేందుకు కూటమినేతల కుట్రలు పన్నుతున్నారనే బలమైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో అర్హులైన కొత్త వారికి సైతం పింఛన్లు అందే పరిస్థితి లేకపోవడంతో ఎన్టీఆర్ భరోసా కాస్త పేదల ఆశలపై నీళ్లు చలింది.


