ఒకటి నుంచి అంగలూరు– తెనాలి చైతన్యయాత్ర | - | Sakshi
Sakshi News home page

ఒకటి నుంచి అంగలూరు– తెనాలి చైతన్యయాత్ర

Sep 27 2026 3:28 AM | Updated on Sep 27 2026 3:28 AM

● ‘కవిరాజు’ భావజాలం ప్రచారం ప్రధాన ఉద్దేశం ● ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌

తెనాలి: ‘కవిరాజు’ త్రిపురనేని రామస్వామి తెనాలి మున్సిపల్‌ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టి శతవసంతాలు పూర్తయిన సందర్భంగా ఆయన జన్మస్థలమైన కృష్ణాజిల్లా అంగలూరు నుంచి తెనాలి వరకు అక్టోబరు 1–2 తేదీల్లో చైతన్యయాత్ర నిర్వహించనున్నట్లు లోకనాయక్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు, మాజీ ఎంపీ ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అక్టోబరు ఒకటో తేదీ ఉదయం 9 గంటలకు అంగలూరులో చైతన్యయాత్రను సెంట్రల్‌ విజిలెన్స్‌ విశ్రాంత కమిషనర్‌ కేవీ చౌదరి ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. 10 గంటకు గుడివాడలో కవిరాజు సాహిత్య విహారం, 11 గంటలకు అక్కడి ఏఎన్‌ఆర్‌ కాలేజిలో సమావేశంలో మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి పాల్గొంటారని వివరించారు. తదుపరి పెదపారుపూడి, మధ్యాహ్నం 2.30కు ఉయ్యూరులో మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు కార్యక్రమం, 4.45కు పోరంకి కృష్ణవేణి స్కూల్‌లో సమావేశం, ఆరు గంటలకు మారుతినగర్‌ విశ్వనాథ సత్యనారాయణ నివాసం, 2వ తేదీన ఉదయం విజయవాడ తుమ్మలపల్లి క్షేత్రయ్య ఆడిటోరియంలో కవిరాజు విగ్రహం వద్ద సమావేశం, 10.30కు గుంటూరులో ఆర్‌వీఆర్‌ కాలేజిలో త్రిపురనేని రామస్వామి సాహితీ సమితి సమావేశం, 11.30కు వడ్లమూడి విజ్ఞాన్‌ యూనివర్సిటీలో డాక్టర్‌ లావు రత్తయ్య ముఖ్యఅతిథిగా సమావేశం ఉంటాయని తెలిపారు. మధ్యాహ్నం 3 గంటలకు సంగంజాగర్లమూడి, 4 గంటలకు తెనాలి అయితానగర్‌ నుంచి కవిరాజు పార్కు వరకు పాదయాత్ర కొనసాగుతుందని వివరించారు. కవిరాజు మనవడు, తత్వవేత్త, రచయిత గోపీచంద్‌ కుమారుడు, ప్రసిద్ధ సినిమానటుడు సాయిచంద్‌ ఈ మొత్తం పాదయాత్రలో పాల్గొంటారని, కృష్ణా, గుంటూరు జిల్లాలోని సాహితీ ప్రముఖులు, కవులు, రచయితలు ఆయా కార్యక్రమాలకు హాజరవుతారని వివరించారు. నేటి యువతకు కవిరాజు భావజాలంలోని హేతువాదం–ఎందుకు? అన్న ప్రశ్న వేసుకోమని చెప్పటం, వివాహాది శుభకార్యాల్లో ఆడంబర వ్యయం చేయొద్దని చెప్పటం, మూఢవిశ్వాసాలకు, అనాగరికమైన ఆచారాలకు దూరంగా ఉండమని సూచించటం ప్రధాన ఉద్దేశంగా ఈ యాత్రను చేపట్టినట్టు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement