నాదెండ్ల: మేజర్ పంచాయతీ గణపవరం సీఆర్ కళాశాల ఎదురుగా ఉన్న జిల్లా పరిషత్ క్వారీలో వ్యర్థాలు పడవేయటంపై రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ మైలవరపు కృష్ణతేజ ఆగ్రహం వ్యక్తం చేశారు. చిలకలూరిపేట నుంచి శనివారం రాష్ట్ర సచివాలయానికి వెళ్లే క్రమంలో గణపవరం వద్ద జాతీయ రహదారి పక్కనే వ్యర్థాలు పడవేయటం, తీవ్ర దుర్వాసన రావటం గమనించారు. దీంతో ఆయన జిల్లా పంచాయతీ అధికారి నాగేశ్వరనాయక్‌కు ఫోన్ చేశారు. వెంటనే చెత్త తొలగింపజేసి ఆ ప్రాంతాన్ని శుభ్రం చేయించాలని ఆదేశించారు. దీంతో స్థానిక ఇన్‌చార్జి పంచాయతీ కార్యదర్శి మారుతీబాబుకు డీపీవో ఫోన్ చేశారు. 24 గంటల్లో వ్యర్థాలు తొలగించాలని ఆదేశించారు. పంచాయతీ కార్యదర్శి సిబ్బందితో కలిసి రెండు పొక్లయినర్లు ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ వ్యర్థాలు తొలగింపజేసి, ఆ ప్రాంతాన్ని శుభ్రం చేశారు. జాతీయ రహదారి పక్కనే జిల్లా పరిషత్ క్వారీ మీదుగా మురుగునీరు ప్రవహించేందుకు వీలుగా కాలువ ఏర్పాటు చేశారు. వ్యర్థాలు పడేస్తుండటంతో కాలువ సైతం పూడిపోయి మురుగు పారుదలకు ఆటంకాలు కలుగుతున్నాయి.
పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కృష్ణతేజ ఆగ్రహం


