కర్లపాలెం(బాపట్లటౌన్): తెలుగుదేశం పార్టీ ఆఫీసుకు పిలిపించి.. మహిళ కాళ్లు పట్టించి...ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారనే అవమానంతో వైఎస్సార్ సీపీ కార్యకర్త ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కర్లపాలెం మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కర్లపాలెం మండలం సమ్మెటవారిపాలెం పంచాయతీ శీలంవారిపాలెం గ్రామానికి చెందిన పిట్టు సుబ్బారెడ్డి..అదే గ్రామానికి చెందిన తన చిన్నమ్మ శివమ్మతో ఇంటి స్థలం విషయంలో ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో శివమ్మ కర్లపాలెం మండలంలో ఇటీవల నిర్వహించిన ప్రజాదర్బార్‌లో పిట్టు సుబ్బారెడ్డిపై ఫిర్యాదు చేసింది. ఈ విషయంపై ఇరువురిని గ్రామపెద్దలతో కలిపి శుక్రవారం టీడీపీ కార్యాలయానికి పిలిపించారు. అక్కడ పార్టీ నాయకులు...గ్రామపెద్దల సమక్షంలో పిట్టు సుబ్బారెడ్డిని శివమ్మ కాళ్లు పట్టుకోవాలని ఆదేశించారు. తప్పని పరిస్థితిలో సుబ్బారెడ్డి శివమ్మ కాళ్లు పట్టుకొని క్షమాపణ అడిగారు. ఈ దృశ్యాలను అక్కడే ఉన్న టీడీపీ నాయకులు ఫోన్‌లో వీడియోలు తీసి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. గ్రామస్తులు అవహేళనగా మాట్లాడుతుండటంతో మనస్థాపం చెందిన సుబ్బారెడ్డి శుక్రవారం పురుగు మందు తాగాడు. విషయాన్ని గమనించిన స్థానికులు హుటాహుటీనా చికిత్స నిమిత్తం బాపట్ల ఏరియా వైద్యశాలకు తరలించారు. ప్రస్తుతం సుబ్బారెడ్డి ఏరియా వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు. శివమ్మ కూడా పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆమెను చికిత్స నిమిత్తం పొన్నూరులోని ప్రైవేటు వైద్యశాలకు తరలించి చికిత్స అనంతరం ఇంటికి తీసుకువచ్చారు.


