చిలకలూరిపేటటౌన్: చిలకలూరిపేట రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బాణసంచా దుకాణాలలో శనివారం వివిధ శాఖల అధికారులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. దుకాణాలకు సంబంధించి లైసెన్సుల వివరాలు, అనుమతించిన సామర్థ్యం, ప్రస్తుతం ఉన్న బాణసంచా నిల్వలు, భద్రతా చర్యలు తదితర అంశాలను అధికారులు పరిశీలించారు. దుకాణాల్లో నిబంధనల మేరకు భద్రతా ఏర్పాట్లు ఉన్నాయా? అనుమతించిన పరిమితికి మించి స్టాక్ నిల్వ చేశారా? లైసెన్సుకు అనుగుణంగానే విక్రయాలు జరుగుతున్నాయా? అనే అంశాలపై ఆరా తీశారు. అగ్నిప్రమాదాలకు ఆస్కారం లేకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని దుకాణదారులకు సూచించారు. తనిఖీల్లో రూరల్ ఎస్‌ఐ జి అనిల్‌కుమార్, లేబర్ ఆఫీసర్ విష్ణు, చిలకలూరిపేట మండల తహసీల్దార్ వేణుగోపాల్‌రావు, ఆర్‌ఐ రమిజా, ఫైర్ ఆఫీసర్ అన్వేష్‌కుమార్‌రెడ్డి బృందం పాల్గొన్నారు.


