చోరీ చేసిన డబ్బులతో బెట్టింగులు, క్యాసినోలకు పెట్టుబడి దొంగిలించిన ఫోన్లతో ఓఎల్‌ఎక్స్‌లో వాహనాల కొనుగోలు కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో దొంగతనాలు ఒంగోలులో వరుస చోరీలకు పాల్పడిన నిందితుడి అరెస్టు
ఒంగోలు టౌన్: వరస చోరీలతో బెంబేలెత్తిస్తున్న అంతర రాష్ట్ర దొంగను ఒంగోలు పోలీసులు పట్టుకొని అరెస్టు చేశారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్పీ హర్షవర్ధన్ రాజు వివరాలు వెల్లడించారు. బెంగళూరుకు చెందిన సొహైల్ ఖాన్ అనేక పేర్లతో చలామణి అవుతున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని షాహిద్ నగర్, చంద్రాయణగుట్టలో నివాసం ఉంటున్నాడు. క్రికెట్ బెట్టింగులు, క్యాసినోల పిచ్చితో దొంగగా మారిన సొహైల్ కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో చోరీలకు పాల్పడుతున్నాడు. వచ్చిన డబ్బులను బెట్టింగులు, క్యాసీనోలలో పెట్టి రూ.42 లక్షలు పోగొట్టుకున్నాడు. ఇంటికి తాళం వేసి ఉన్న ఇళ్లను కళ్లుమూసి తెరిచేలోపే కొల్లగొట్టడంలో దిట్ట. ఈనెల 5వ తేదీ ఒంగోలులోని ఆంధ్ర కేసరి నగర్లో, అదే రోజు సమతానగర్లో తాళం వేసి ఉన్న ఇళ్లల్లో చోరీలకు పాల్పడ్డాడు. దీన్ని సీరియస్‌గా తీసుకున్న ఎస్పీ ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి, సీసీ కెమెరాలను విశ్లేషణ చేసి నిందితుడిని గుర్తించారు. ఓఎల్‌ఎక్స్ ద్వారా కోనుగోలు చేసిన పల్సర్ బైక్‌పై హైదరాబాద్ నుంచి ఒంగోలు వచ్చిన నిందితుడు ఒకే రోజు రెండు ఇళ్లలో దొంగతనాలు చేశాడు. ఈ రెండు చోరీల్లో 146.200 గ్రాముల బంగారు నగలు దోచుకొని వెళ్లాడు. మళ్లీ ఒంగోలులో దొంగతనం చేసేందుకు మంగళవారం ఎక్స్‌యూవీ 700 కారులో వస్తున్న నిందితుడు సౌత్ బైపాస్‌లో వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసుల కంట పడ్డాడు. తప్పించుకొని పారిపోయేందుకు ప్రయత్నించగా వెంటబడి పట్టుకున్నారు. నిందితుడి నుంచి సుమారు కోటి మూడు లక్షల రూపాయల విలువైన బంగారు నగలు, రూ.15 లక్షల నగదు, రూ.18 లక్షల విలువైన కారును స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులకు చిక్కకుండా మొబైళ్లు చోరీ చేసి...
చోరీలు చేయడంలో ఆరితేరిన సొహైల్ ఖాన్ పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు ఇతరుల ఫోన్ కొట్టేసేవాడు. ఆ ఫోన్‌లోని సిమ్ ఉపయోగించి ఓటీపీ ద్వారా ఓఎల్‌ఎక్స్‌లో మోటారు బైకు కొనుగోలు చేస్తాడు. ఆ వాహనం మీద వివిధ ప్రాంతాలకు వెళ్లి చోరీలు చేసిన తరువాత ఆ వాహనాన్ని విక్రయించేస్తాడు. దొంగిలించిన బంగారు ఆభరణాలను హైదరాబాద్‌లోని షాహిద్‌నగర్లో అద్దెకు తీసుకున్న గదిలో ప్రత్యేక పరికరాలతో కరిగించి బంగారు దుకాణాల్లో విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది. నిందితుడి మీద జూన్ 26 నుంచి నేటి వరకు నరసరావుపేట, మైలవరం, నూజివీడు, వినుకొండ, ఒంగోలు ప్రాంతాల్లో పగటి సమయంలో చోరీలకు పాల్పడినట్లు కేసులు నమోదయ్యాయి. కర్ణాటక, తెలంగాణాలోని పలు పోలీసు స్టేషన్లలో కూడా కేసులు నమోదై ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. కేసును ఛేదించిన పోలీసులకు ఎస్పీ ప్రత్యేక అభినందనలు తెలిపారు. సమావేశంలో డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, తాలుకా సీఐ విజయకృష్ణ, ఒన్‌టౌన్ సీఐ వెంకటేశ్వర్లు, సీసీఎస్ సీఐ కమాలాకర్ తదితరులు పాల్గొన్నారు.


