యోగా ప్రదర్శనతో ఉత్సవాలకు శ్రీకారం | - | Sakshi
Sakshi News home page

యోగా ప్రదర్శనతో ఉత్సవాలకు శ్రీకారం

Jan 29 2026 6:16 AM | Updated on Jan 29 2026 6:16 AM

యోగా ప్రదర్శనతో ఉత్సవాలకు శ్రీకారం

యోగా ప్రదర్శనతో ఉత్సవాలకు శ్రీకారం

యోగా ప్రదర్శనతో ఉత్సవాలకు శ్రీకారం

తుది ప్రణాళిక ఖరారు

కోటను సందర్శించిన

జిల్లా కలెక్టర్‌, ఎమ్మెల్యే

యడ్లపాడు: కొండవీడు కోట గొప్ప పర్యాటక కేంద్రంగా, అలాగే భావితరాలకు ఈ ప్రాంత చరిత్ర తెలిసేలా చేయడమే లక్ష్యంగా ఫిబ్రవరి 7, 8వ తేదీల్లో కొండవీడు ఫెస్ట్‌ – 2026 నిర్వహిస్తున్నట్లు పల్నాడు జిల్లా కలెక్టర్‌ కృత్తికా శుక్లా తెలిపారు. ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులతో కలిసి బుధవారం కొండవీడుకోటను సందర్శించారు. ఉత్సవాల నిర్వహణపై శాఖలవారీగా చేపట్టాల్సిన విధులను సమీక్షించి మీడియాతో మాట్లాడారు. ఉత్సవాలు కొండపైనే నిర్వహించేలా నిర్ణయం తీసుకున్నారు. రెండు రోజులు ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరిగే ఆయా కార్యక్రమాలను వారు వెల్లడించారు.

ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం

సందర్శకులు తమ వాహనాలను కొండ దిగువన ఏర్పాటు చేసిన పార్కింగ్‌ ప్రదేశంలో నిలిపి, అక్కడి నుంచి ఘాట్‌రోడ్డు మీదుగా ఏర్పాటు చేసిన 10 ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా కొండపైకి చేరుకోవాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. భద్రతా కారణాలరీత్యా ఇతర వాహనాలకు కొండపైకి అనుమతి ఉండదని స్పష్టం చేశారు. వివిధ శాఖల జిల్లా అధికారులకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై స్పష్టమైన మార్గనిర్దేశం చేశారు.

పర్యాటక అభివృద్ధికి చర్యలు

జాతీయ స్థాయి పర్యాటక, సాంస్కృతిక కేంద్రంగా కొండవీడును తీర్చిదిద్ది పూర్వవైభవం తీసుకొస్తామని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. సమీక్షలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. చారిత్రక కొండవీడు కోట పూర్వవైభవాన్ని చాటి చెప్పేలా ఫిబ్రవరి 7, 8వ తేదీల్లో ‘కొండవీడు హెరిటేజ్‌ ఉత్సవాలు’ ఘనంగా నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే ప్రత్తిపాటి ప్రకటించారు. తొలిరోజు ప్రత్యేక అతిథిగా పర్యాటక మంత్రి కందుల దుర్గేశ్‌, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌తోపాటు మరో ఇద్దరు మంత్రులు పాల్గొంటారన్నారు. ఉత్సవాల ముందు ఫిబ్రవరి 5న ప్రచార కార్యక్రమం, కొండవీడు చరిత్ర తెలిపే ప్రత్యేక గీతం ఆవిష్కరణ ఉంటుందన్నారు. ఉత్సవాల అనంతరం ఫిబ్రవరి 10వ తేదీ నుంచి వేసవి ముగిసే వరకు కొండపై పర్యాటకుల కోసం నైట్‌ క్యాంపెయిన్‌, భోజన వసతులు అందుబాటులో తెస్తున్నట్లు తెలిపారు. రూ.220 కోట్లతో చౌడవరం నుంచి కోటకు 5 కి.మీ. టన్నెల్‌ నిర్మాణాన్ని త్వరలో పూర్తి చేసేలా చర్యలు, అలాగే కోటపై ఉన్న లక్ష్మీనరసింహస్వామి ఆలయం, దర్గా, మసీదులకు పురావస్తుశాఖ అనుమతులతో మరమ్మతులు చేపడతామని తెలిపారు. వీటితో పాటు జంతు ప్రదర్శనశాల, సఫారి రైడింగ్‌ ఏర్పాటు చేసే దిశగా ప్రతిపాదనలు చేస్తున్నామని తెలిపారు. ఇకపై ప్రతి ఏటా జనవరి 18–23వ తేదీ వరకు వరకు జాతీయ స్థాయి ఎడ్ల బలప్రదర్శన పోటీలు, ఫిబ్రవరి తొలి శని, ఆదివారాల్లో కొండవీడు ఉత్సవాలు నిర్వహించాలని నిర్ణయించారు. కార్యక్రమంలో ఏఎస్పీ జీవీ సంతోష్‌, డీఎఫ్‌వో కృష్ణప్రియ, ఆర్డీవో మధులత, టూరిజం శాఖ మేనేజర్‌ నాయుడమ్మ, పలు శాఖల అధికారులు, ఏఎంసీ చైర్మన్‌ కరీముల్లా, వైస్‌ చైర్మన్‌ పిల్లి కోటి, సొసైటీ చైర్మన్‌ సుబ్బారావు, సర్పంచ్‌లు మానం సాంబయ్య, ఎంపీటీసీ మద్దూరి శ్రీనివాసరెడ్డి, మండలస్థాయి అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

మూడోసారి జరిగే కొండవీడు ఉత్సవాలు గతానికి భిన్నంగా చేయనున్నట్లు జిల్లా కలెక్టర్‌ కృత్తికా శుక్లా తెలిపారు. ఉత్సవాల వివరాలను తెలియజేస్తూ... ఫిబ్రవరి 7వ తేదీన ఉదయం 7 గంటలకు యోగా ఏజెన్సీలు, స్వచ్ఛంద సంస్థల సమన్వయంతో ఆహ్లాదకర వాతావరణంలో యోగా ప్రదర్శనతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టి, 10 గంటలకు అధికారికంగా కొండవీడు ఫెస్ట్‌ ప్రారంభిస్తామని తెలిపారు. కొండపై ఉత్సవాల్లో భాగంగా బోటింగ్‌, ట్రెక్కింగ్‌, రాప్లింగ్‌, రాక్‌ క్‌లైంబింగ్‌, ఆర్చరీ, హార్స్‌ రైడింగ్‌, హెలికాప్టర్‌ రైడింగ్‌ వంటి అడ్వంచర్‌ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. శాండ్‌ అండ్‌ ఆర్ట్‌, ఫ్లవర్‌, లేజర్‌, క్రాకర్స్‌ షో, సినీగాయని గీతామాధురితో సంగీత విభావరి, వెస్ట్రన్స్‌ డాన్స్‌, పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. జబర్దస్త్‌ కళాకారులు, ఒడిశా, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు చెందిన ప్రముఖ కళాకారులు ఈ వేడుకల్లో పాల్గొంటారన్నారు. కొండ దిగువన ఎమ్యూజ్‌మెంట్‌ పార్కు, వెహికల్‌ పార్కింగ్‌ సదుపాయం ఏర్పాటు, ఇందులో జాయింట్‌ వీల్‌, ఎగ్జిబిషన్‌ వంటివి ఉంటాయి. కొండవీడు సమీప పాఠశాలల విద్యార్థులకు గానం, నృత్యం, అభినయం విభాగాల్లో పోటీలు నిర్వహించి వారి ప్రతిభను ప్రోత్సహించనున్నారు. ముందుగా కొండదిగువన ఉన్న గులాబీతోటను కలెక్టర్‌ సందర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement