‘పచ్చ’ నేతల ఉచ్చులో విలవిల
ఎక్కడైనా ఇదే తంతు
● భవన నిర్మాణదారులకు
మాయమాటలు
● అనుమతుల అవసరమే లేకుండా
చూస్తామంటూ వసూళ్లు
● చట్టప్రకారమే వ్యవహరిస్తామంటున్న
అధికారులు
● టీడీపీ నాయకుల తీరుతో
లబోదిబోమంటున్న ప్రజలు
చీరాల అర్బన్(చీరాల): చంద్రబాబు ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని ప్రజలు విమర్శిస్తున్నారు. నిర్ణయాలు పారదర్శకంగా ఉన్నాయని, ఉంటాయని సీఎం చంద్రబాబు పదే పదే వల్లె వేయడంపై మండిపడుతున్నారు. చీరాల నియోజకవర్గంలో పలువురు టీడీపీ కీలక నేతల తీరు ఆయన పాలనలో డొల్లతనానికి నిదర్శనంగా నిలుస్తోంది. పనికో రేటు వసూలు చేస్తున్నారు. వారు స్వపక్షమైనా, విపక్షమైనా ఒకే తీరుగా వ్యవహరిస్తున్నారు. కాకుంటే స్వపక్షం వారికి మాత్రం చెల్లించాల్సిన కప్పంలో ఒకింత రాయితీ ఇచ్చి ఏదో వెలగబెట్టినట్లు చాటుకుంటున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో సంబంధిత శాఖల అధికారులు స్వామి కార్యం, స్వకార్యం అనే చందంగా తమ వంతు నజరానా ఇస్తేనే పనులు చేస్తున్నారు.
కొత్త భవనం అంటేనే హడల్...
మున్సిపల్ పరిధిలో నూతన భవన నిర్మాణదారులు హడలిపోతున్నారు. నూతన భవన నిర్మాణాలకు సంబంధించి సదరు యజమానులు ఏ నిబంధనలను ఉల్లంఘించారనే కోణంలో సదరు పచ్చనేతల సొంత సైన్యం ఆరా తీస్తోంది. కొద్ది రోజులు నిర్మాణం జరిగే వరకు అధికారులు కూడా ఆవైపు కన్నెత్తి చూడరు. తరువాత సదరు పచ్చ నేతలు సంబంధిత అధికారులతో నిర్మాణదారులకు నోటీసులు ఇప్పిస్తారు. ఆ క్రమంలో సదరు సొంత సైన్యం ఆయా భవన నిర్మాణ యజమానులతో బేరసారాలు చేస్తోంది. పెద్ద మొత్తంలో వసూలు చేస్తారు. తరువాత ఎలాంటి ఇబ్బంది ఉండదని నమ్మబలుతారు. కానీ తరువాత చట్టప్రకారం నిబంధనల మేరకు అపరాధ రుసుం లేదా క్రమబద్ధీకరణ రుసుం చెల్లించి క్రమబద్ధీకరించుకోవాలని సంబంధిత అధికారులు ఒత్తిడి తెస్తారు. ఈ నేథ్యంలో ఇటీవల కాలంలో ఓ భవన నిర్మాణ యజమాని దగ్గర భారీ మొత్తం వసూలు చేశారని, తరువాత అతను బీపీఎస్ (బిల్డింగ్ పీనలైజేషన్ స్కీం)కింద క్రమబద్ధీకరణకు అదననంగా చెల్లించాల్సి వచ్చిందని చీరాల రాజకీయవర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. అయితే ఇది ఒక ఉదాహరణ మాత్రమేనని, అలాంటివి పలు ఘటనలు ఉన్నాయని విషయం తెలిసిన సాధారణ ప్రజలు కూడా చర్చించుకుంటున్నారు.
పట్టణ, రూరల్ పరిధి... ఇలా ఎక్కడైనా లేఅవుట్లకు సంబంధించి కూడా ఇదే పంథా నడుస్తోందంటున్నారు. ఇది కూడా బహిరంగ రహస్యమే. అయితే అనధికారిక లేఅవుట్లులో స్థలాలు కొనుగోలు చేసిన పలువురు వాటిలో గృహ నిర్మాణానికి సంబంధిత అనుమతులు, మౌలిక వసతులు లేక ఇబ్బంది పడుతున్నామని వాపోతున్నారు. సదరు పచ్చ నేతలు తమ సెటిల్‌మెంట్లు అన్నీ గోప్యంగా సాగిస్తున్నామని భావిస్తున్నప్పటికీ అవి బహిరంగ రహస్యాలుగా మారుతున్నాయని ప్రజలు పేర్కొంటున్నారు. నేతలకు కట్టే కప్పం గురించి లేదా తమకు జరుగుతున్న నష్టం గురించి బాధితులు తమ సన్నిహితుల దగ్గర గోడు వెళ్లబోసుకుంటున్నారే కానీ బహిరంగ పరచలేకపోతున్నారు. సన్నిహితుల నుంచి పచ్చ నేతల ప్రయివేటు పంచాయతీలన్నీ బహిరంగం అవుతున్నాయని విషయం తెలిసిన వారు అంటున్నారు.


