మల్లన్న తలపాగా తయారీకి శ్రీకారం
వేటపాలెం: దేశాయిపేట పంచాయతీ పరిధిలోగల చేనేత కార్మికుడు బూసం శ్రీనివాసరావు గృహంలో శ్రీశైలం మల్లన్న తలపాగా తయారు చేయడానికి తెల్లటి నూలు పోగులు అల్లు ఏర్పాటు చేసి బుధవారం శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా దేవాంగ సంక్షేమ సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ జిల్లా దేవాంగ సంక్షేమ సంఘం పిలుపు మేరకు వర్కింగ్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో తలపాగా చేనేత మగ్గంపై తయారు చేయడం ప్రారంభించినట్లు తెలిపారు. మహా శివరాత్రి పండగ సందర్భంగా మల్లన్న ఆలయ శిఖరానికి లింగోద్భవ సమయంలో మాలధారులు.. నవనందులు కలుపుతూ ఆలయ శిఖరానికి చేనేత మగ్గంపై నేసిన తలపాగా వస్త్రాన్ని కడతామని తెలిపారు. శివమాలధార స్వాములు చేతి మగ్గంపై తయారు చేస్తారన్నారు. దీనికి సంబంధించి ప్రాథమికంగా తెల్లటి నూలు పోగులు అల్లు ఏర్పాటు చేసి తలపాగా నేతకు సిద్ధం చేశారు. కార్యక్రమంలో సంఘం ప్రతిధులు, గ్రామస్తులు, శివ భక్తులు పాల్గొన్నారు.


