బైక్ అదుపుతప్పి యువకుడు దుర్మరణం
వేటపాలెం: వేగంగా వెళ్తున్న బైక్ అదుపు తప్పడంతో వెనుక కూర్చున్న యువకుడు కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. 216 జాతీయ రహదారి అక్కాయిపాలెం బైపాస్ రోడ్డులో సోమవారం ఈ సంఘటన చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. కొత్తపేటకు చెందిన కళ్యాణ్(35), మరో యువకుడు చీరాలలోని ఓ హోటల్‌లో పనిచేస్తుంటారు. సోమవారం హోటల్‌కు సెలవు కావడంతో ఇద్దరూ కలిసి బైక్‌పై రామన్నపేట వద్ద దేవస్థానానికి వచ్చి తిరిగి చీరాల వెళ్తున్నారు. ఈ క్రమంలో అక్కాయిపాలెం వద్ద బైక్ అదుపు తప్పింది. బైక్ వెనుక కూర్చున్న యువకుడు అశోక్ రోడ్డుపై పడి తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్ నడుపుతున్న యువకుడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. అదే సమయంలో అటు వైపు వెళ్తున్న వైఎస్సార్ సీపీ చీరాల నియోజకవర్గ ఇన్‌చార్జి కరణం వెంకటేష్ ప్రమాద సంఘటన గమనించి ఆగారు. గాయపడిన యువకుడిని చికిత్స నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. మృతి చెందిన యువకుడి వివరాలు తెలుసుకొని, అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని చీరాల ఏరియా వైద్యశాలకు తరలించే వరకు కరణం వెంకటేష్ అక్కడే ఉండి మానవత్వాన్ని చాటుకున్నారు. సంఘనా స్థలాన్ని ఎస్సై జనార్దన్ పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


