నేడు పెదకూరపాడు జడ్పీ హైస్కూల్ 80వ వార్షికోత్సవం
పెదకూరపాడు: పెదకూరపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 80 వసంతాల వేడుకకు సిద్ధమైంది. మంగళవారం పాఠశాల వార్షికోత్సవం ఘనంగా నిర్వహించేందుకు విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈక్రమంలో తమ పాఠశాల వార్షికోత్సవానికి రావాలంటూ విద్యార్థులు పూర్వ విద్యార్థుల, తల్లిదండ్రుల ఇళ్లకు వెళ్లి ఆహ్వానిస్తున్నారు. 1946 సంవత్సరంలో మాజీ ఎమ్మెల్యే దర్శి లక్ష్మయ్య దాతృత్వం, సహకారంతో పెదకూరపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఏర్పడింది. అప్పటినుంచి ఇప్పటివరకు ఎందరో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు అందించి, వారిని ఉన్నత శిఖరాలకు చేర్చి నిత్య నూతనంగా శోభిల్లుతుంది. ఇక్కడ చదువుకున్న ఎంతోమంది దేశరక్షణ, రాజకీయ, వ్యాపార, వైద్య, విద్య, రియల్ ఎస్టేట్ రంగాల్లో సేవలు అందిస్తున్నారు.
హాజరుకానున్న ప్రముఖులు
పాఠశాల 80 వసంతాల వేడుకలకు ఇక్కడ విద్యను అభ్యసించి అనేక రంగాల్లో సేవలు అందిస్తున్న పూర్వ విద్యార్థులు హాజరుకానున్నారు. మాజీ ఎకై ్సజ్ శాఖ మంత్రి నెట్టెం రఘురాం, మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్, జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ డైరెక్టర్ అతోటి మురళి ముకుంద్, ప్రాఫిట్ షూ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ శివ కోటేశ్వరరావు తోపాటు పలువురు ప్రముఖులు ఈ వేడుకలకు హాజరుకానున్నారు.
హాజరై.. ఆశీర్వదించండి
పాఠశాల 80 వసంతాల వేడుకకు విద్యార్థులు తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులు, గ్రామ పెద్దలు, గతంలో విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులు అందరూ హాజరై విద్యార్థులను ఆశీర్వదించాలని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కాకాని వెంకటరమణ కోరారు. దాతల సహకారంతో ప్రతిభావంతులైన పదో తరగతి విద్యార్థులకు సన్మానం, గత ఏడాది పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఉపకార వేతనాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.
హాజరుకానున్న పాఠశాల పూర్వ విద్యార్థులు, రాజకీయ నేతలు
నేడు పెదకూరపాడు జడ్పీ హైస్కూల్ 80వ వార్షికోత్సవం


