పెదకాకాని శివాలయంలో మాంసాహార భోజనం
●తమవెంట తెచ్చుకుని భోజనం
చేసిన యాత్రికులు
●సిబ్బంది వైఫల్యం మరోసారి
బట్టబయలు
పెదకాకాని: శివాలయానికి వచ్చిన భక్తులు ఆలయ ప్రాంగణంలో మాంసాహారంతో భోజనం చేయడం చర్చనీయాంశంగా మారింది. పెదకాకాని శ్రీ మల్లేశ్వరస్వామి దేవస్థానానికి ఆదివారం రాత్రి సుమారు 9 గంటల సమయంలో యాత్రికుల బస్సు వచ్చింది. ఆలయ ప్రాంగణంలోని బస్సు నిలిపి అందులో ఉన్న ఆహారం గిన్నెలు బయటకు తీసి అక్కడే భోజనం చేశారు. వారు చేసిన భోజనం మాంసాహారం కావడంతో ఆ వాసనలు స్థానికులు గుర్తించి, ప్రశ్నించడంతో తిన్న ఆకులు సైతం అనుమానం రాకుండా, ఆ బస్సులోనే యాత్రికులు తీసుకెళ్లారు. ఇంత జరుగుతున్నా ఆలయ నైట్ వాచ్‌మెన్, సిబ్బంది ఏం చేస్తున్నారని పలువురు భక్తులు ప్రశ్నిస్తున్నారు. శివాలయంలో ఇటువంటి సంఘటనలు జరగకుండా ఆలయ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
– దీనిపై ఆలయ డిప్యూటీ కమిషనర్ గోగినేని లీలాకుమార్‌ను వివరణ కోరగా ఆదివారం రాత్రి ఆలయానికి వచ్చిన బస్సులోని ప్రయాణికులు భోజనం చేశారని, అందులో మాంసాహారం ఉందనే విషయం సోమవారం తమ దృష్టికి వచ్చిందన్నారు. బస్సు నెంబరు ఆధారంగా వారిని గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయడం జరిగిందని తెలియజేశారు.
నరసరావుపేట రూరల్: 77వ గణతంత్ర దినోత్సవాన్ని జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. అదనపు ఎస్పీ(అడ్మిన్) జేవీ సంతోష్, ఏఆర్ అదనపు ఎస్పీ వి.సత్తిరాజు, ఏఆర్ డీఎస్పీ గాంధీరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.
తెనాలి: గణతంత్ర వేడుకలలో భాగంగా ఢిల్లీలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో పట్టణానికి చెందిన ప్రముఖ కూచిపూడి యువనర్తకి ఆరాధ్యుల తేజస్వి ప్రఖ్యకు అరుదైన అవకాశం లభించింది. రిపబ్లిక్ పెరేడ్‌లో అన్ని రాష్ట్ర సంప్రదాయ నృత్యవిభాగంగా తెలుగురాష్ట్రాల నుండి పాల్గొన్నవారిలో తేజస్వి ప్రఖ్య ఒకరు వందేమాతరం గీతంకు చేసిన బృందనాట్యంలో పాల్గొన్నారు. దూరదర్శన్ ’బి’ గ్రేడ్‌తో పాటు కూచిపూడి నృత్యం ఎంఏ చేసిన ప్రఖ్య, ప్రస్తుతం హైదరాబాద్‌లో నివాసముంటూ సెంట్రల్ యూనివర్సిటీ విశ్రాంత ప్రొఫెసర్ ఆచార్య పసుమర్తి రామలింగశాస్త్రి వద్ద కూచిపూడిలో ‘నట్టువాంగం‘లోననూ శిక్షణ తీసుకుంటోంది. ప్రస్తుతం పీహెచ్‌డీకి ఎన్‌ఈటీ, దూరదర్శన్ బీహై ఫలితాల కోసం ఎదురుచూస్తోంది.


