అన్నీ ‘గ్యాస్’ మాటలే!
ఉచిత గ్యాస్ సిలిండర్ పేరిట దగా చంద్రబాబు పాలనలో అంతా మాయే సబ్సిడీ కోసం లబ్ధిదారుల ఎదురుచూపు చిత్తశుద్ధి లేని పాలకుల హామీలతో పేదలకు కష్టాలు బ్యాంకుల చుట్టూ తిరిగినా నగదు జమ కాక సర్కార్‌పై ఆగ్రహం
ఇంకా డబ్బులు పడలేదు
వేటపాలెం: చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చే హామీలన్నీ ‘గ్యాస్’ మాటలే అని తేలిపోయింది. రాష్ట్రంలో మహిళలకు ఉచిత వంట గ్యాస్ పథకం అమలు మొక్కుబడిగా సాగుతోంది. 2024 నవంబరు నెలాఖరు వరకు మొదటి సిలిండర్ డబ్బులు జమ చేస్తామని చెప్పారు. అయితే పథక లబ్ధిదారుల్లో తెల్ల రేషన్ కార్డుదారులందరికీ సబ్సిడీ డబ్బులు ఇవ్వాల్సి ఉన్నా ఏదో పేరుకు కొంతమందికి వేసి చేతులు దులుపుకొన్నారు.
ఇప్పటివరకు ప్రతి నెలా గ్యాస్ సిలిండర్లు బుక్ చేసుకున్నా నేటికీ సబ్సిడీ 50 శాతం మంది లబ్ధిదారులకు కూడా రాలేదు. ఏడాది గడిచి పోయినా అతీగతీ లేదు. ఎప్పుడు డబ్బులు వేస్తారో, సెల్‌ఫోన్‌లో మెసేజ్ వస్తుందేమోనని చూసుకుంటున్నా జమకాక పోవడం వల్ల నిరాశగా మహిళలు కూటమి పాలకులపై మండిపడతున్నారు. గ్రామాల్లో ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి ఉంది. మండల పరిధిలో రెండు ఇండియన్ గ్యాస్ ఏజెన్సీలున్నాయి. వీటి పరిధిలో 22 వేల గ్యాస్ కనెక్షలున్నాయి. అందులో ఉజ్వల, పీఏయూవై, దీపం, జనరల్ కనెక్షన్‌లు కూడా ఉన్నాయి. ఏజెన్సీ నిర్వాహకులు మండలం పరిధిలోని గ్యాస్ వినియోగదారులకు నిరంతరం ఇళ్లకు గ్యాస్ సరఫరా చేస్తున్నారు. 2024 సాధారణ ఎన్నికల్లో చంద్రబాబు అండ్ కో.. ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తామని ప్రకటించింది. ఆ మేరకు పథకం అమలు తర్వాత వారం రోజులకు త మంది లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో అక్కడక్కడా జమ చేశారు. మిగతా వారికి ఇంతవరకూ డబ్బులు వేయలేదు.
బ్యాంకుల చుట్టూ తిరగాల్సిందే..
రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డుదారులందరికీ ఉచిత గ్యాస్ పథకం వర్తించదని పాలకులు ప్రకటించారు. ఏడాది అయినప్పటికీ గ్యాస్ తెచ్చుకున్న 50 శాతం మందికి డబ్బులు పడలేదని, సబ్సిడీ డబ్బులు కోసం బ్యాంక్‌ల చుట్టూ పాస్‌బుక్ చేతబట్టుకుని తిరగాల్సి వస్తోందని మహిళలు మండిపడుతున్నారు. దీనికి నిధులు ఎప్పుడు మంజూరు చేస్తారో తెలియని పరిస్థితి ఉంది. పాలకులు మాత్రం అందరికీ ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇచ్చినట్లు ప్రచారం చేసుకుంటున్నారు. గ్యాస్ డెలివరీ చేసిన 48 గంటల్లోపు సబ్సిడీ డబ్బులు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమవుతాయని చెప్పారు.
ఎవరిని అడిగినా అంతే..
ఉచిత గ్యాస్ పథకానికి సంబంధించి సమస్యలుంటే ఎవరికి చెప్పు కోవాలో తెలియక లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. సబ్సిడీ డబ్బులు ఎందుకు పడలేదని ఏజెన్సీ నిర్వాహకులను ప్రశ్నిస్తే పౌర సరఫరాల శాఖ కార్యాలయంలో అడగమని అంటున్నారు. అక్కడికి వెళితే బ్యాంక్ ఈకేవైసీ చేయించాలటున్నారని, ఈకేవైసీ చేయించామని చెబితే గ్యాస్ ఆఫీసుకు వెళ్లమని చెబుతున్నారు. దీంతో ఉచిత గ్యాస్ పథకం కూటమి ప్రభుత్వ మాయగా ప్రజలు విమర్శిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి కొరవడడంతో ఇలా ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారని లబ్ధిదారులైన మహిళలు మండిపడుతున్నారు.
ఏడాదిగా ఇప్పటివరకు ఐదు సిలిండర్లు బుక్ చేశాం. మా ఇంటికి వచ్చిన డెలివరీ బాయ్ వద్ద డబ్బులు చెల్లించి సిలిండర్ తీసుకున్నా. మరుసటి రోజు గ్యాస్ డబ్బులు పడతాయని, బ్యాంక్‌లో తీసుకోండని చెప్పారు. ఒక్క సిలిండర్ తాలూకూ అయినా డబ్బులు ఇంతవరకు పడలేదు. ఎవరిని అడగాలో తెలియక బ్యాంక్ చుట్టూ తిరుగుతున్నా. తక్షణమే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలు చేయాలి. బ్యాంకుల చుట్టూ తిరిగినా ఫలితం లేదు.
– సుజాత, వేటపాలెం


