కన్నీటి వెతల ‘చేనేత’ బతుకులు
మసకబారుతున్న నేతన్నల జీవన చిత్రం వృత్తిని బిడ్డలకు కూడా నేర్పలేమని ఆవేదన వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో ఏటా రూ.24 వేలు సాయం చంద్రబాబు సర్కార్ వచ్చాక అన్నీ మాటలే అమలు కాని ‘200 యూనిట్ల ఉచిత విద్యుత్తు’ పథకం ఆర్థిక కష్టాల సుడిగుండంలో చిక్కి కార్మికులు విలవిల
చీరాల అర్బన్(చీరాల): చీరాల చేనేతల ఖిల్లా. చేనేత రంగానికి పుట్టిల్లు, సృజనకు మారుపేరు. కళాత్మక దృష్టి ఈ ప్రాంతం నేతన్నల సొంతం. ఒకప్పుడు చీరాల మండలం ఈపురుపాలెం నుంచి వేటపాలెం మండలం పందిళ్లపల్లి వరకు చేనేత గుంట మగ్గాల లయచప్పుళ్లు శ్రావ్యంగా వినిపించేవి. రెండు దశాబ్దాల క్రితం ఈ ప్రాంతంలో సుమారు 17 వేలకుపైగా మగ్గాలు ఉండేవి. ప్రస్తుతం బాపట్ల జిల్లా మొత్తం మీద కేవలం 8,500 మగ్గాలే ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. దీన్ని బట్టి చేనేత రంగం ఎంత కునారిల్లిందో అర్థం చేసుకోవచ్చు. ఇక తమ పని వారసత్వం తమ బిడ్డలకు ఇవ్వబోమని సగటు చేనేత కార్మికులు చెబుతున్నారంటే ఆ రంగం దుస్థితి కళ్లకు కడుతోంది.
వైఎస్సార్‌సీపీ హయాంలో చేయూత
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఎంతో ఔదార్యంతో మగ్గం ఉన్న ప్రతి చేనేత కుటుంబానికి ఏడాదికి రూ.24 వేల నగదు వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. గత ఎన్నికల్లో మాయమాటలు చెప్పి, అంతకన్నా ఎక్కువ ఇస్తామని నేతన్నల ఓట్లును కూటమి నేతలు దండుకున్నారు. ఆ తరువాత ముఖం చాటేశారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లవుతోంది. నేతన్నల సంక్షేమానికి ఒక్క రూపాయి ఇచ్చిన పాపాన పోలేదు. ఇక 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు ఊసే లేదు. అడిగిన వారికి పొంతనలేని సమాధానాలు వస్తున్నాయని సగటు నేత కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేనేత కార్మికులకు సంబంధించి ఒక్కొక్కరిది ఒక్కో బాధ. మాటలు వేరైనా అందరి భావం ఒక్కటే. తమ పని వారసత్వంగా బిడ్డలకు ఇవ్వబోమన్నదే. ఇప్పటికే మూడొంతుల మగ్గాలు అటకెక్కాయి. ఇదే పరిస్థితి కొనసాగితే మరో దశాబ్దకాలంలో మగ్గం చప్పుళ్లు కనుమరుగవుతాయని ఆవేదన చెందుతున్నారు.
పేరుకుపోతున్న నిల్వలు
వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో మార్కెటింగ్ అవకాశాలు ఆశాజనకంగా ఉన్నాయి. దీంతో కరోనా సమయంలో కొంత ఇబ్బంది పడినా క్రమేణా విక్రయాలు ఊపందుకున్నాయి. చంద్రబాబు ప్రభుత్వంలో ఎగ్జిబిషన్లు, విక్రయ కేంద్రాలు ఏర్పాటు పేరుకు కూడా లేవని పలువురు పెదవి విరుస్తున్నారు. ముందస్తుగా నేసిన చీరలు, ఎక్కువ కాలం ఉండటంతో కొనుగోలుదారులు కొనుగోలుకు విముఖత చూపుతున్నారు. డిజైన్ మారాలంటే మగ్గంపైన సుమారు రూ.7 వేల నుంచి రూ.9 వేల వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఆర్థిక స్థోమత లేక నష్టపోతున్నామని కార్మికులు నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు. సంక్రాంతి పండుగ వచ్చినా రేషన్ సరుకుల్లో కందిపప్పు ఊసు లేదు. డీలర్లను అడిగితే తమ చేతుల్లో ఏం లేదని చెబుతున్నారు. కనీసం పండుగ రోజు పప్పన్నం, పాయసం చేసుకుందామన్నా చేయి చాపాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


