
దోమల నివారణకు చర్యలు చేపట్టాలి
పర్చూరు(చినగంజాం): దోమల నివారణకు చర్యలు చేపట్టాలని మండల ప్రత్యేకాధికారి, డిప్యూటీ కలెక్టర్ ఎస్. లవన్న పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. శనివారం మండలంలోని చెరుకూరు, రమణాయపాలెం, అడుసుమల్లి, బోడవాడ గ్రామాల్లో పారిశుద్ధ్యంపై ప్రజలకు అవగాహన కల్పించడానికి మండల అధికారులతో కలిసి సందర్శించారు. చెరుకూరులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి గ్రామాల్లో ఇంటింటికి తిరిగి ఫీవర్ సర్వే నిర్వహించాలని సిబ్బందిని ఆదేశించారు. పంచాయతీ సిబ్బంది పారిశుద్ధ్యంపై ప్రజలకు అవగాహన కల్పించాలని, నీరు, మురుగు నీరు నిలువ ఉండకుండా చూసుకోవాలని, పరిసరాలను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచాలని సూచించారు. సిబ్బంది దోమల లార్వా నివారణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మురుగు నీరు నిలువ ఉన్నచోట ఆయిల్ బాల్స్, గ్రామాల్లో ఫాగింగ్ చేపట్టాలని సూచించారు, రమణాయ పాలెం గ్రామంలో ఎస్‌డబ్ల్యూపీసీ కేంద్రాన్ని సందర్శించి సిబ్బందికి ప్రతి రోజూ గ్రామాల్లో చెత్తను తొలగించాలంటూ పలు సూచనలు చేశారు. బోడవాడ గ్రామంలో నీటి పథకాన్ని సందర్శించి ప్రజలకు స్వచ్ఛమైన నీటిని అందించాలని, ట్యాంకులు, చెరువుల్లో ఎప్పటికప్పుడు క్లోరినేషన్ చేయాలని తెలిపారు. అడుసుమల్లి గ్రామంలో ఇంటింటికీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎక్కడైనా జ్వరాలున్నట్లయితే మండలాధికారులు, వైద్యాధికారులకు తెలియజేయాలన్నారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఎంపీడీఓ వి. ప్రద్యుమ్నకుమార్, డిప్యూటీ ఎంపీడీఓ కె. సత్యనారాయణ, చెరుకురు పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్ గౌతం, రమణాయపాలెం, బోడవాడ కార్యదర్శులు హరిప్రసాద్, వెంకటేష్, సచివాలయ సిబ్బంది, పంచాయతీ సిబ్బంది, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.
ప్రత్యేక అధికారి, డిప్యూటీ కలెక్టర్ లవన్న