
బ్లాక్ బర్లీ పొగాకు సాగుపై నిషేధం
‘అక్షర ఆంధ్ర’ను విజయవంతం చేద్దాం
బాపట్ల: జిల్లాలో బ్లాక్ బర్లీ పొగాకు సాగుపై నిషేధం విధించినట్లు జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి తెలిపారు. ఈ ఏడాది సదరు ఆదేశాలను ఉల్లంఘించే రైతులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బుధవారం బాపట్ల కలెక్టరేట్‌లో కలెక్టర్ మురళి అధ్యక్షతన జరిగిన సమీక్ష సమావేశంలో మార్క్‌ఫెడ్, వ్యవసాయ శాఖ అధికారులు, ప్రైవేట్ బయ్యర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కంపెనీల హామీలతో రైతులు అధికంగా బ్లాక్ బర్లీ సాగు చేశారని తెలిపారు. కొనుగోలు సమయంలో కొన్ని కంపెనీలు వెనకడుగు వేశాయన్నారు. డిమాండ్‌కు మించి సాగు వల్ల మార్కెట్‌లో ధరలు గణనీయంగా పడిపోయాయని, ఇది రైతుల ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపిందని వివరించారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో జిల్లాలో బ్లాక్ బర్లీ పంట సాగు చేయకూడదని, ఇది పూర్తిగా నిషేధితమని పునరుద్ఘాటించారు. నర్సరీలలోనూ బ్లాక్ బర్లీ నారు సాగు చేయటం కూడా నిషేధమని స్పష్టం చేశారు. నిబంధనలను ఉల్లంఘిస్తే వ్యవసాయ శాఖ అధికారులు ఆ పంటను ధ్వంసం చేయడంతోపాటు చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు. రైతులు ప్రత్యామ్నాయ, లాభదాయక పంటలపై దృష్టి సారించాలని కలెక్టర్ సూచించారు. ఇప్పటికే పండించిన బ్లాక్ బర్లీ పొగాకును రైతులు ప్రైవేట్ కంపెనీలకు విక్రయించవచ్చని తెలిపారు. వర్షాల ప్రభావం నుంచి పంటను రక్షించుకోవాలని, తేమ శాతం 20% మించిన బేళ్లను కొనుగోలు కేంద్రాలకు తీసుకురావద్దని స్పష్టం చేశారు. ప్రతి రైతు పండించిన పంట మొత్తం కొనుగోలు చేస్తామని తెలిపారు.
ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టాలి జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి రైతులు సహకరించాలని సూచన
బాపట్ల: అక్షర ఆంధ్ర కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి అధికారులను ఆదేశించారు. బుధవారం స్థానిక కలెక్టరేట్‌లో అక్షర ఆంధ్ర కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడానికి తీసుకోవలసిన చర్యలపై జిల్లా కలెక్టర్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. అక్షరాస్యత పెంపునకు వివిధ శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. అక్షర ఆంధ్ర కార్యక్రమానికిగాను గ్రామ స్థాయిలో వయోజన విద్యా కేంద్రాల ఏర్పాటుపై దృష్టి సారించాలని పేర్కొన్నారు. ‘ఉల్లాస్’ – అక్షర ఆంధ్ర కార్యక్రమంలో జీవితాంతం నేర్చుకునే అవకాశాల కల్పన కోసం కేంద్ర ప్రణాళికలు రూపొందించడం జరిగిందన్నారు. ఆర్థిక, సాంకేతిక, క్రియాత్మక అక్షరాస్యత సాధించే దిశగా అడుగులు వేయాలని ఆయన చెప్పారు. అమలులో వలంటీర్లు , ఉపాధ్యాయులు, విద్యాసంస్థల పాత్ర కీలకమని అన్నారు. స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యం తీసుకోవాలని కోరారు. జిల్లాలో పీ–4 మార్గదర్శకులతో గ్రామాలలో ఉన్న నిరక్షరాస్యులను మ్యాపింగ్ చేయాలన్నారు. సమావేశంలో వయోజన విద్యాశాఖ డిప్యూటీ డైరెక్టర్ నరసింహారావు, జిల్లా పంచాయతీ అధికారి ప్రభాకర్, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి రాధా మాధవి, విద్యాశాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.