
అవినీతికి పాల్పడిన మెప్మా సిబ్బందిపై చర్యలు
రేపల్లె: నకిలీ గ్రూపులు సృష్టించి బ్యాంకుల ద్వారా రుణాలు పొందిన మహిళలను మోసం చేసిన మెప్మా సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాస్ చెప్పారు. పట్టణంలోని 21వ వార్డులో 2023 సంవత్సరంలో పలువురు ఆర్‌పీలు నకిలీ గ్రూపులను సృష్టించి, వివిధ బ్యాంకుల ద్వారా రూ.2 కోట్ల రుణాలను తీసుకుని గ్రూపు సభ్యులను మోసగించిన ఘటనపై విచారణ చేసి సభ్యులకు న్యాయం చేయాలని కోరుతూ ఇటీవల బాపట్లలో జరిగిన గ్రీవెన్స్‌లో జిల్లా కలెక్టర్ వెంకట మురళీకి సీపీఎం, ఐద్వాల ఆధ్వర్యంలో బాధిత మహిళలు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఆదేశాలతో డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాస్ బుధవారం రేపల్లె పట్టణానికి విచ్చేసి 21వవార్డులో బాధిత మహిళలతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. అవినీతికి సంబంధించి పూర్తిస్థాయిలో విచారణ చేపట్టామని పేర్కొన్నారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవటం జరుగుతుందని చెప్పారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు తమ సమస్యలను వివరించారు. తమ ప్రమేయం లేకుండా గ్రూపులను ఏర్పాటు చేసి ఆర్‌పీలు రుణాలు పొందటం వల్ల చెల్లింపులు కోరుతూ బ్యాంకుల నుంచి నోటీసులు వస్తున్నాయని వాపోయారు. తాము పొందని రుణాలను ఎలా చెల్లించాలని ప్రశ్నించారు. తమ పేర్లపై వివిధ బ్యాంకులలో రుణాలు పొందినట్లు నమోదై ఉండటంతో గ్రూపు రుణాలు పొందేందుకు అవకాశం లేకుండా పోయిందన్నారు. దీంతోపాటుగా ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాల లబ్ధి బ్యాంకు అకౌంట్‌లో జమ అయినప్పటికీ రికవరీ పేరుతో మేనేజర్‌లు జమ చేసుకుంటున్నారన్నారు. కూలీనాలీ చేసుకుని జీవించే తమకు బ్యాంకు రుణాలు ఇప్పించి సమస్యను పరిష్కరించాలని పలువురు మహిళలు వాపోయారు. దీంతో స్పందించిన పీడీ శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ సమస్యపై బ్యాంకర్లతో మాట్లాడి సంక్షేమ పథకాల లబ్ధి ఖాతాదారులకు చేరేలా చర్యలు తీసుకుంటామన్నారు. బాధిత మహిళలకు డ్వాక్రా సేవలు అందేలా కృషి చేస్తామని చెప్పారు. సమావేశంలో సీపీఎం పట్టణ కార్యదర్శి మణిలాల్ మాట్లాడుతూ పేద మహిళల ప్రమేయం లేకుండా అవినీతికి పాల్పడిన మెప్మా సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. బాధిత మహిళలకు కొత్త గ్రూపులు ఏర్పాటు చేసి సాధ్యమైన త్వరలో రుణాలు మంజూరు చేయటంతోపాటు ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి చేరేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పోరాటాలను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఐద్వా నాయకులు నాంచారమ్మ, ధనమ్మ, ఎస్‌కే ఆశ, జహీరా, షబానా, బాధిత మహిళలు తదితరులు పాల్గొన్నారు.
డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాస్