
రాష్ట్ర స్థాయి ఉపాధ్యాయ పురస్కార దరఖాస్తుల స్వీకరణకు గడ
గుంటూరు ఎడ్యుకేషన్: రాష్ట్రస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు ఈనెల 8వ తేదీలోపు దరఖాస్తు చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుక శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అర్హులైన ఉపాధ్యాయులు దాఖలు చేసిన ప్రతిపాదనలను డివిజినల్ స్థాయిలో ఉప విద్యాశాఖాధికారి చైర్మన్‌గా నలుగురు సభ్యులతో ఏర్పాటు చేసిన కమిటీ జిల్లాస్థాయి కమిటీకి ఈనెల 12వ తేదీలోపు విధిగా సమర్పించాలని ఆదేశించారు. జిల్లాస్థాయి కమిటీ ద్వారా ఉపాధ్యాయుల తుది జాబితాను రాష్ట్రస్థాయి కమిటీకి ఈనెల 16లోపు సమర్పించాల్సి ఉందని తెలిపారు. ఈనెల 8వ తేదీ తరువాత సమర్పించే దరఖాస్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబడవని స్పష్టం చేశారు.
హత్య కేసులో వ్యక్తికి యావజ్జీవ శిక్ష
గుంటూరు లీగల్: భార్య హత్య కేసులో భర్తకు యావజ్జీవ శిక్ష, రూ.3 వేలు జరిమానా విధిస్తూ రెండో అదనపు జిల్లా కోర్టు జడ్జి వై.నాగరాజా శుక్రవారం తీర్పునిచ్చారు. వివరాలు.. అగతవరప్పాడుకు చెందిన తోట ఏడుకొండలు కుమార్తె శారద(26)ను అదే గ్రామానికి చెందిన గవిరిబోయిన శివశంకర్‌తో 2009 మే 6న వివాహం జరిపించారు. శివశంకర్, ఆర్మీలో పనిచేస్తున్నాడు. శివశంకర్ సెలవులో ఇంటికి వచ్చిన సమయంలో, అతడి కుటుంబ సభ్యుల ప్రభావంతో భార్య శారదపై అనుచిత ఆరోపణలు చేయడంతో వివాదం చోటుచేసుకుంది. ఈ వివాదం పెద్దల మధ్య రాజీ కుదిరినా, ఆ తరువాత శారద తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లింది. అప్పట్లో నెలకి శివశంకర్ రూ.3000 చెల్లించడానికి అంగీకరించగా, శారద రూ.6,000 అడిగిన నేపథ్యంలో ఘర్షణ చోటుచేసుకుంది. 2015 జూలై 26 న శివశంకర్ తన భార్య శారదపై కత్తితో దాడి చేసి ఆమెను హత్య చేశాడు. ఘటనను అడ్డుకునేందుకు ప్రయత్నించిన మల్లేశ్వరి అనే మహిళ గాయపడింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో విచారించిన రెండవ అదనపు జిల్లా కోర్టు జడ్జి మొదటి నిందితుడు గవిరిబోయిన శివశంకర్‌ను యావజ్జీవ కారాగార శిక్షతో పాటు రూ.3వేలు జరిమానా విధించారు. రెండో నిందితురాలు గవిరిబోయిన సుబ్బమ్మ మృతి చెందడంతో కేసు ముగించారు.
రెండు లారీలు ఢీకొని డ్రైవర్లకు గాయాలు
వినుకొండ: వినుకొండ మండలం చీకటిగలపాలెం మోడల్ స్కూల్ సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మూడు లారీలు ఒకదానికొకటి ఢీకొనగా ఇద్దరు లారీ డ్రైవర్లు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు... తెల్లవారుజామున ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు మొదట ఢీకొన్నాయి. వాటిని వెనుక నుంచి వేగంగా వస్తున్న మరో లారీ ఢీకొనడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. ఈ ఘటనలో లారీల ముందు భాగం నుజ్జునుజ్జు అయ్యాయి. స్థానికులు 108కి సమాచారం తెలపడంతో గాయపడిన ఇద్దరు డ్రైవర్లను ఆసుపత్రికి తరలించారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ప్రమాదానికి గురైన వాహనాలను సంఘటనా స్థలం నుంచి పక్కకు జరిపించారు. డ్రైవర్లను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదుచేసుకుని దార్యప్తు చేస్తున్నారు.
కేవలం రూపాయికే బీఎస్‌ఎన్‌ఎల్ సరికొత్త ఫ్రీడమ్
నరసరావుపేట: భారత్ సంచార్ నిగం లిమిటెడ్ (బీఎస్‌ఎన్‌ఎల్) సరికొత్త ఫ్రీడం ప్లాన్, కేవలం రూ.1తో 30 రోజుల వ్యాలిడిటీ, అపరిమిత కాలింగ్, రోజుకు 2 జీబి డేటా, రోజుకు 100 మెసేజ్‌లు, ఉచిత సిమ్‌కార్డు ఇవ్వబడుతుందని గుంటూరు బిజినెస్ ఏరియా ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ శ్రీ సప్పరపు శ్రీధర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలియచేశారు. ఎం.యన్.పి. వినియోగదారులకు కూడా ఈ ఆఫర్ వర్తిస్తుందని, కావున అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, సిమ్ కార్డు కావలసిన వారు దగ్గరలోని బీఎస్‌ఎన్‌ఎల్ సేవా కేంద్రాన్ని సంప్రదించవలసినదిగా కోరారు.