
స్మార్ట్ మీటర్లు రద్దు చేయండి
జె.పంగులూరు: స్మార్ట్ మీటర్లు వెంటనే రద్దు చేయాలని, విద్యుత్ చార్జీల నిలువు దోపిడీ ఆపాలని సీపీఎం జిల్లా కార్యదర్శి గంగయ్య డిమాండ్ చేశారు. ప్రమాదకర స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలనే కార్యక్రమంలో భాగంగా శుక్రవారం పంగులూరు ప్రధాన కూడలిలో కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి గంగయ్య మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పటి టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి పార్టీలు కరెంటు చార్టీలపై బాదుడే, బాదుడు కార్యక్రమం చేసిందన్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అఽధికారంలోకి వచ్చిన తరువాత సార్ట్ మీటర్లు ఏర్పాటు చేసి ప్రజలను బాదుతున్నారన్నారు. సంవత్సర కాలంలో కరెంట్ బిల్లులు పెరిగిపోయి జనం గగ్గోలు పెడుతున్నా, కూటమి ప్రభుత్వం కరెంటు చార్టీలు పెంచలేదంటూ మోసగిస్తోందన్నారు. ఆదాయం పెరగక, కరెంటు బిల్లులు కట్టలేక జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఆదనపు లోడు పేరుతో డెవలప్‌మెంట్ చార్టీలు, వినియోగదారుల డిపాజిట్ల సాకుతో వేల రూపాయలు దొడ్డిదారిని వసూలు చేస్తూనే ఉన్నారన్నారు. మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో ఈ పాటికే ప్రభుత్వ కార్యాలయాల్లో, దుకాణాలలో స్మార్ట్ మీటర్లు బిగించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు రాయిని వినోద్‌బాబు, తలపనేని రామారావు, ఆదుమ్ సాహేబ్, సుధాకర్, పి. ఏలియా తదితరులు పాల్గొన్నారు.
సీపీఎం జిల్లా కార్యదర్శి గంగయ్య డిమాండ్