
అనధికార లేఔట్లు క్రమబద్ధీకరణ చేసుకోవాలి
బాపట్లఅర్బన్: బావుడా పరిధిలో ఉన్న అనధి కార లే ఔట్లను క్రమబద్ధీకరణ చేసుకోవాలని బాపట్ల అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ప్లానింగ్ అధికారి శోభన్‌బాబు తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. నిబంధనల ప్రకారం 30 జూన్ 2025లోపు రిజిస్ట్రేషన్ అయిన ప్లాట్లు, లే ఔట్లను క్రమబద్ధీకరించుకోవాలని తెలిపారు. అనధికారిక లేఔట్లపై స్పందిస్తూ పైన తెలిపిన తేదీ ప్రకారం ఒక ప్లాట్ అయినా అమ్మకం జరిగి ఉండాలన్నారు. జూలై 26వ తేదీ నుంచి 90 రోజుల్లోగా క్రమబద్ధీకరణకి దరఖాస్తు చేసుకోవాలన్నారు. ప్రధానంగా ఎల్‌ఆర్‌ఎస్ 2020లో దరఖాస్తు చేయని వారితోపాటు, అనధికారిక లేఔట్లలో ప్లాట్ ఉన్నవారు, లేఔట్లను అభివృద్ధి చేసిన వారు అర్హులవుతారని పేర్కొన్నారు. సంబంధిత లేఔట్లలో ఓపెన్ స్పేస్ లేకపోతే సాధారణ రుసుముతోపాటుపాటు 14 శాతం ఓపెన్ స్పేస్ చార్జీలు కూడా చెల్లించాలన్నారు. అక్టోబరు 24వ తేదీలోపు దరఖాస్తు చేయకపోతే లేఔట్లలో, ప్లాట్‌లలో భవిష్యత్తులో భవన నిర్మాణాలు అనుమతులు ఇవ్వబోమన్నారు. ఇలాంటి స్థలాల క్రయవిక్రయాలకు వీల్లేకుండా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలలో నిషేధిత భూముల జాబితాలో నమోదు చేస్తామని వివరించారు. రేపల్లె, బాపట్ల పురపాలక సంఘం, బావుడా ఆధ్వర్యంలో అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు.