
‘ఉపాధి హామీ’ అక్రమాలపై విచారణ
బల్లికురవ: బోగస్ మస్టర్లలో చేసిన పనులను పదే పదే చూపిస్తూ ఉపాధి హామీ సిబ్బంది అవినీతి అక్రమాలకు పాల్పడుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని జిల్లా సంయుక్త కలెక్టర్ నాగిరెడ్డి అసహనం వ్యక్తం చేశారు. 2024–25 ఆర్థిక సంవత్సరానికి మండలంలో రూ.12 కోట్లతో నిర్వహించిన 645 పనులకు సంబంఽధించి సామాజిక తనిఖీలో అవినీతి బహిర్గతమైంది. ఈ మేరకు పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలపై కలెక్టర్ ఆదేశాల మేరకు సంయుక్త కలెక్టర్ బుధవారం మండలంలో విచారణ నిర్వహించారు. కొమ్మినేనివారిపాలెంలో నిర్వహించిన పనులకు సంబంధించి సామాజిక తనిఖీ పూర్తయినా ఒక్క పనినీ అధికారులు చూపకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. వైదన, ఎస్‌ఎల్ గుడిపాడులో నిర్వహించిన పనుల్లో అక్రమాలపై ప్రశ్నించారు. చేసిన పనులనే పదే పదే చూపుతున్నా, పర్యవేక్షించాల్సిన అధికారులు కార్యాలయాలకే పరిమితం అయ్యారా? అని ప్రశ్నించారు. మీడియా ప్రతినిధుల వద్దనున్న బోగస్ మస్టర్ల వివరాలను తెలుసుకున్నారు. అంగన్‌వాడీలు, ప్రభుత్వ ఉద్యోగులు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, చదువుకునే విద్యార్థులు, 80 సంవత్సరాలకు పైబడిన వృద్ధులకు మస్టర్లు వేసి సొమ్ము స్వాహా చేసినట్లుగా గుర్తించారు. మండలంలోని 21 పంచాయతీల్లో నిర్వహించిన పనులపై ప్రత్యేక నివేదికను తయారు చేసి పంపాలని తహసీల్దార్ రవి నాయక్‌ను ఆదేశించారు. రికవరీ చేయాలని తెలిపారు. ఎంపీడీఓ పాండురంగస్వామి, ఏపీవో రమాదేవి పాల్గొన్నారు.
కేజీబీవీల తనిఖీ
విద్యతోనే ఉన్నత స్థాయికి ఎదగాలని బాపట్ల జిల్లా సంయుక్త కలెక్టర్, సర్వ శిక్ష అభియాన్ ఏపీసీ నాగిరెడ్డి అన్నారు. బుధవారం సాయంత్రం స్థానిక కస్తూర్బా గాంఽధీ గురుకుల బాలికల విద్యాలయాన్ని ఆయన తనిఖీ చేశారు. బాలికల వద్దనన్న ట్యాబ్‌లను పరిశీలించారు. అనంతరం వారిని వివిధ ప్రశ్నలు అడిగి, సమాధానాలు రాబట్టారు. విద్యార్థులకు అందుతున్న వసతుల గురించి ప్రిన్సిపాల్ కె. సరళకుమారిని అడిగి తెలుసుకున్నారు. అదనపు గదుల నిర్మాణాన్ని సకాలంలో పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటే బెడ్‌లు, మంచాలు ఏర్పాటు చేయిస్తామని చెప్పారు.

‘ఉపాధి హామీ’ అక్రమాలపై విచారణ