
ముంపు ప్రాంత వాసులను ఆదుకుంటాం
కొల్లూరు: కృష్ణా నదికి ఎగువ నుంచి వరదలు వస్తున్న తరుణంలో పరివాహక ప్రాంత వాసులను అన్నివిధాలా ఆదుకుంటామని జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి తెలిపారు. ప్రకాశం బ్యారేజ్ నుంచి సముద్రంలోకి బుధవారం 87 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసిన నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా ఆయన కొల్లూరు మండల పరిషత్తు కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. రేపల్లె ఆర్డీఓ రామ లక్ష్మితో కలసి నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ముందస్తు జాగ్రత్తలపై యంత్రాంగానికి పలు సూచనలు చేశారు. గురువారం మధ్యాహ్నం సమయానికి 3 లక్షల నుంచి 3.50 లక్షల క్యూసెక్కులకు వరద చేరుకునే అవకాశం ఉందన్నారు. కొల్లూరు, భట్టిప్రోలు, రేపల్లె మండలాల పరిధిలో 67 కిలోమీటర్ల పొడవున ఉన్న కృష్ణా కుడి కరకట్టకు యుద్ధప్రాతిపదికన రక్షణ చర్యలు చేపట్టాలని ఆర్‌సీ యంత్రాంగాన్ని ఆదేశించారు. గతేడాది చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో 11.47 లక్షల క్యూసెక్కుల వరద నీరు రావడంతో కరకట్ట రక్షణ విషయంలో త్రుటిలో గండం నుంచి గట్టెక్కగలిగామని, ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలన్నారు. ఒకటి లేదా రెండు కిలోమీటర్లకు ఓ పర్యవేక్షణ అధికారిని నియమించి కట్ట పటిష్టత విషయంలో స్థానికులతో కలిసి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మూడు నెలలకు అవసరమైన నిత్యావసర సరకులను ఆయా గ్రామాలకు తరలించాలని ఆదేశించారు. కొల్లూరు, భట్టిప్రోలు, రేపల్లె మండలాల పరిధిలో 30 గ్రామాల వారికి సరకుల కోసం బోట్లను అందుబాటులో ఉంచాలన్నారు. అనంతరం కలెక్టర్ విలేకరులతో మాట్లాడుతూ, ఆల్మట్టి నుంచి ప్రకాశం బ్యారేజ్ వరకు ఉన్న డ్యామ్‌ల నుంచి విడుదలవుతున్న నీటి పరిమాణాన్ని ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుంటూ ప్రజల రక్షణకు చర్యలు చేపడుతున్నామన్నారు. సమావేశంలో తహసీల్దార్ బి.వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ కె.నరసింహారావు, వేమూరు సీఐ పీవీ ఆంజనేయులు, ఆర్‌సీ ఏఈలు విజయ్‌రాజు, నాగేశ్వర నాయక్, వివిధ శాఖల జిల్లా, మండలస్థాయి అధికారులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి ప్రస్తుత నీటి విడుదలతో ముప్పు లేదు సంబంధిత యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి కృష్ణా కరకట్ట బలోపేతం చేయాలని యంత్రాంగానికి ఆదేశం