
జెడ్పీ చైర్‌పర్సన్ అమెరికా పయనం
వైస్ చైర్మన్‌కు అప్పగించని బాధ్యతలు
గుంటూరు ఎడ్యుకేషన్: జెడ్పీ చైర్‌పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా వ్యక్తిగత పనులపై విదేశాలకు వెళ్లారు. అనారోగ్యంతో వైద్యం చేయించుకునేందుకు అమెరికా వెళ్లినట్లు తెలుస్తోంది. దీనిపై అధికారికంగా ఎటువంటి సమాచారం లేదు. జెడ్పీ చైర్‌పర్సన్ స్థానికంగా అందుబాటులో లేని సమయంలో వైస్ చైర్మన్‌కు బాధ్యతలు అప్పగించాల్సి ఉంది. అయితే, హెనీ క్రిస్టినా బాధ్యతలను ఎవ్వరికీ అప్పగించ లేదు. దీనిపై అధికారులను వివరణ కోరగా చైర్‌పర్సన్ విదేశాలకు వెళ్లిన విషయం వాస్తవమేనని తెలిపారు.
వైభవంగా నరనారాయణ జయంతి
తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని విజయకీలాద్రి దివ్య క్షేత్రంపై నరనారాయణ జయంతిని బుధవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ మేనేజర్ పురాణం వెంకటాచార్యులు మాట్లాడుతూ త్రిదండి చిన్న జీయర్‌స్వామి మంగళా శాసనాలతో నరనారాయణ జయంతి సందర్భంగా ఉదయం 7 గంటలకు అష్టాక్షరీ మహామంత్ర జపం, శ్రీకృష్ణుడికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించామని తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ, ప్రసాదాలు స్వీకరించారని ఆయన పేర్కొన్నారు.
పశ్చిమ డెల్టాకు 6,034 క్యూసెక్కులు విడుదల
దుగ్గిరాల: విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుంచి పశ్చిమ డెల్టాకు 6,034 క్యూసెక్కులను బుధవారం విడుదల చేసినట్లు నీటి పారుదల శాఖ అధికారులు తెలిపారు. బ్యారేజీ వద్ద 12 అడుగులు నీటి మట్టం ఉందని తెలిపారు. దుగ్గిరాల సబ్ డివిజన్ హైలెవెల్‌కి 246, బ్యాంక్ కెనాల్ 1356, తూర్పు కాలువకు 650, పశ్చివ కాలువకు 227, నిజాంపట్నం కాలువకు 450, కొమ్మూరు కాలువకు 1780 క్యూసెక్కులు వదిలినట్లు పేర్కొన్నారు. బ్యారేజీ నుంచి సముద్రంలోకి 71,000 క్యూసెక్కులు విడుదల చేస్తున్నట్లు తెలిపారు.
లారీ ఢీకొని విద్యార్థి మృతి
పట్నంబజారు: ప్రభుత్వ బియ్యం సరఫరా చేసే లారీ ఢీకొని తొమ్మిదో తరగతి విద్యార్థి మృతి చెందిన సంఘటన గుంటూరు నగరంలో బుధవారం చోటు చేసుకుంది. ఈస్ట్ ట్రాఫిక్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆనందపేటకు చెందిన షేక్ షాహిద్ అహ్మద్ (13) కొత్తపేటలోని భాష్యం స్కూల్‌లో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. ఉదయం స్కూల్‌కు వెళుతున్న క్రమంలో పెన్ను కోసం తండ్రి ద్విచక్ర వాహనంపై ఒక్కడే బయటకు వచ్చాడు. ఈ సమయంలో గుంటూరు నుంచి తెనాలి వెళుతున్న రేషన్ బియ్యం ఢీకొట్టింది. దీంతో షాహిద్ అహ్మద్ అక్కడికక్కడే మృతి చెందాడు. తండ్రి షబ్బీర్ అహ్మద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఎల్‌ఆర్‌ఎస్ స్కీంను సద్వినియోగం చేసుకోవాలి
నెహ్రూనగర్: రాష్ట్ర ప్రభుత్వం అనధికార లే ఔట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణ పథకం–2020ని పొడిగించిందని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పథకంలో రాష్ట్రంలో జూన్ 30, 2025 వరకు వేసిన అనధికార లే ఔట్లను, ప్లాట్లను నిర్ణీత అపరాధ రుసుం చెల్లించి క్రమబద్ధీకరించుకునే అవకాశం కల్పించిందని తెలిపారు. లైసెన్సుడ్ సర్వేయర్, ఇంజినీర్లు, ఆర్కిటెక్చర్లు ద్వారా అనధికార లే ఔట్‌లో ఉన్న స్థలానికి ప్లాను తయారు చేసుకొని, అపరాధ రుసుములో 50 శాతం (లేదా కనిష్టంగా రూ.10 వేలు) చెల్లించి, జూలై 26 నుంచి 90 రోజులలోపు (అక్టోబర్ 24లోపు) ఆన్‌లైన్‌లో http://rrdtcp.ap.gov.in లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఈ పథకంలో 45 రోజులలోపు పూర్తి రుసుం చెల్లించిన వారికి 10 శాతం, 45 నుంచి 90 రోజుల్లో చెల్లిస్తే 5 శాతం రాయితీ లభిస్తుందన్నారు. గడువు అనంతరం మిగిలిన లేఔట్లు/ప్లాట్లకు విద్యుత్ సరఫరా, నీటి సరఫరా, డ్రైయినేజీ అనుమతించబడవని తెలిపారు. రిజిస్ట్రేషన్ శాఖ యొక్క నిషేధ ఆస్తుల రిజిస్టర్‌లో నమోదు చేస్తారని చెప్పారు. లావాదేవీలు అనుమతించబడవని ఆయన స్పష్టం చేశారు.

జెడ్పీ చైర్‌పర్సన్ అమెరికా పయనం