
రెచ్చిపోయిన దొంగలు
మార్టూరు: మండల కేంద్రమైన మార్టూరులో మంగళవారం ఉదయం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు ఓ ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. స్థానిక కొణిదెన రోడ్డులో నివాసం ఉండే కొండముది కళ్యాణి మూడు రోజుల క్రితం తమ ఇంటికి తాళం వేసుకొని కాశీ యాత్రకు బయలుదేరి వెళ్లింది. ఈ క్రమంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో మంగళవారం తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు కళ్యాణి ఇంటి కిటికీలు ధ్వంసం చేసి లోనికి చొరబడ్డారు. అనంతరం ఇంట్లోని బీరువా, కప్ బోర్డులను సైతం ధ్వంసం చేసి అందులో ఉన్న బంగారు, వెండి ఆభరణాలతో పాటు కొంత నగదును చోరీ చేశారు. మంగళవారం ఉదయం చోరీ విషయాన్ని గమనించిన సమీప బంధువులు కాశీ యాత్రలో ఉన్న కళ్యాణికి, పోలీసులకు సమాచారం అందించారు. బాపట్ల నుంచి వచ్చిన క్లూస్ టీం బృందం కళ్యాణి నివాసాన్ని పరిశీలించి వేలిముద్రలు సేకరించారు. కాశీ యాత్ర విరమించుకొని తిరుగు ప్రయాణమైన కళ్యాణి మార్టూరు వచ్చిన అనంతరం పోలీసులు కేసు నమోదు చేయనున్నారు.
కిటికీలు, కప్‌బోర్డులు ధ్వంసం చేసి సొత్తు అపహరణ