గంజాయి కేసులో ముగ్గురికి జైలు | - | Sakshi
Sakshi News home page

గంజాయి కేసులో ముగ్గురికి జైలు

Jul 29 2025 8:00 AM | Updated on Jul 29 2025 8:00 AM

గంజాయి కేసులో ముగ్గురికి జైలు

గంజాయి కేసులో ముగ్గురికి జైలు

తీర్పు వెల్లడించిన గుంటూరు–1 ఏడీజే కోర్టు న్యాయమూర్తి

బాపట్లటౌన్‌: గంజాయి క్రయ, విక్రయాలకు పాల్పడిన ముగ్గురికి నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తూ గుంటూరు–1 ఏడీజే కోర్టు న్యాయమూర్తి సోమవారం తీర్పు వెల్లడించారు. వివరాల్లోకి వెళితే... కర్లపాలెం మండల పరిధిలోని చేపల మార్కెట్‌ సమీపంలోని రాజీవ్‌నగర్‌ కాలనీకి చెందిన దాసరి శ్రీనివాసరావు, ఏలూరు పట్టణానికి చెందిన గాలం పాపారావు, విశాఖపట్నం జిల్లా రొల్లగుంట మండలం చెన్నగోపాలపట్టణం గ్రామానికి చెందిన అప్పలనాయుడు పోతురాజులకు జైలు శిక్ష విధించారు. బాపట్ల జిల్లా కర్లపాలెం గ్రామంలోని రాజీవ్‌ నగర్‌ రోడ్డులోని చేపల మార్కెట్‌ సమీపంలో ఒక ఇంటిలో దాసరి శ్రీనివాసరావు, తోకల పిచ్చయ్య(మృతుడు)లు గంజాయి విక్రయిస్తున్నారనే సమాచారంతో 2014 డిసెంబర్‌ 30న అప్పటి బాపట్ల రూరల్‌ సర్కిల్‌ సీఐ వి.మల్లికార్జునరావు దాడి చేశారు. ఇరువురిని అరెస్ట్‌ చేసి కోర్టుకు హాజరుపరిచారు. వారు ఇచ్చిన సమాచారం ఆధారంగా గంజాయి సరఫరా చేస్తున్న ఏలూరు పట్టణానికి చెందిన గాలం పాపారావు, విశాఖపట్నం జిల్లా రోల్లగుంట మండలం చెన్నగోపాలపట్నం గ్రామానికి చెందిన పోతురాజు అప్పలనాయుడులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. వీరి నుంచి భారీ మొత్తంలో గంజాయి స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు ప్రథమ అదనపు జిల్లా న్యాయస్థానంలో కేసు విచారణకు రావడంతో జిల్లా ఎస్పీ తుషార్‌ డూడీ ఆదేశాల మేరకు బాపట్ల రూరల్‌ సర్కిల్‌ సీఐ హరికృష్ణ, కర్లపాలెం ఎస్సై రవీంద్రలు కేసు ట్రైల్‌ను ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకుంటూ, సరైన రీతిలో సాక్ష్యం చెప్పే విధంగా సాక్షులకు తర్ఫీదు ఇచ్చారు. కోర్టు విధులు నిర్వహించిన కానిస్టేబుల్‌ కె.శివాజీ సాక్షులను సకాలంలో కోర్టులో హాజరుపరిచారు. వాదనలు విన్న గుంటూరు–1 ఏడీజే కోర్టు న్యాయమూర్తి విఎల్‌ఏ సత్యవతి ముగ్గురు నిందితులు ఒక్కొక్కరికి 4 సంవత్సరాలు జైలుశిక్ష, రూ.10 వేల చొప్పున జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారు.

కురగల్లులో ఇరువర్గాల మధ్య ఘర్షణ

తాడేపల్లి రూరల్‌ : మంగళగిరి మండల పరిధిలోని కురగల్లులో సోమవారం ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇద్దరి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇందులో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో బంధువులు వైద్యం నిమిత్తం ఎయిమ్స్‌ ఆసుపత్రిలో చేర్పించారు. కురగల్లులో పక్క పక్కనే నివిసించే తోట రామారావు, తోట వెంకటేశ్వరరావుల మధ్య ఇంటి దారి విషయంలో పాత గొడవలు ఉన్నాయి. రామారావుకు వత్తాసు పలుకుతూ వెళ్లిన బొర్లా శ్రీనివాసరావుపై వెంకటేశ్వరరావు దాడి చేశాడు. ఈ ఘర్షణలో శ్రీనివాసరావు తలకు తీవ్ర గాయమైంది. ఆసుపత్రిలో చికిత్స అనంతరం మంగళగిరి రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు శ్రీనివాసరావు తెలిపాడు.

లే అవుట్లలో ఇళ్ల నిర్మాణాల వేగం పెంచాలి

కలెక్టర్‌ ఎస్‌.నాగలక్ష్మి

గుంటూరు వెస్ట్‌: జిల్లాలోని వివిధ లే అవుట్లలో నిర్మాణంలో ఉన్న ఇళ్లను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్‌ ఎస్‌.నాగలక్ష్మి ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్‌ శంకరన్‌ మినీ సమావేశ మందిరం నుంచి సోమవారం అధికారులతో వీడియో సమావేశం ద్వారా మాట్లాడారు. పూర్తయిన ఇళ్లు, నిర్మాణంలో ఉన్న వాటిని ప్రతి వారం లక్ష్యాలు నిర్దేశించుకుని పూర్తయ్యేలా అధికారులు పర్యవేక్షణ చేయాలని తెలిపారు. ఆప్షన్‌–1, 2లో ఆర్థిక సాయం పొందిన వారు వీలైనంత వేగంగా నిర్మాణాలు పూర్తి చేయాలని ఆమె తెలిపారు. పేదలను ఆదుకునే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన పీ–4 కార్యక్రమంపై గ్రామ సభలు, దాతల మ్యాపింగ్‌, నీడ్‌ అసిస్‌మెంట్‌ సర్వే సకాలంలో పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గుర్తించిన బంగారు కుటుంబాలను విశ్లేషించిన లక్ష్యాల మేరకు దాతలతో మ్యాపింగ్‌ను ఆగస్టు 10లోపు పూర్తి చేయాలని ఆమె చెప్పారు. తల్లికి వందనం పథకంలో నగదు పొందని లబ్ధిదారులు ఇచ్చిన అర్జీల సర్వే వెంటనే పూర్తి చేయాలని తెలిపారు. ఉపాధి హామీ పథకం ద్వారా పశువుల పాకల నిర్మాణం, దాణా సాగు, ఉద్యాన పంటల సాగుకు గ్రామాల వారీగా ఎంపీడీవోలు వెంటనే ప్రతిపాదనలు తెలపాలని ఆమె ఆదేశించారు. సమావేశంలో సీపీఓ శేషశ్రీ , హౌసింగ్‌ పీడీ ప్రసాద్‌, డ్వామా పీడీ శంకర్‌ పాల్గొన్నారు.

ధర్మస్థల ఘటనలపై దర్యాప్తు వేగవంతం చేయాలి

లక్ష్మీపురం: కర్ణాటకలోని మంజునాథ దేవాలయం ధర్మస్థలలో వందలాది మంది యువతులు, మహిళలపై అత్యాచారం, హత్యోదంత ఘటనలు భయానకంతో పాటు తీవ్రమైన ఆందోళన కలిగిస్తున్నాయని ఆంధ్రప్రదేశ్‌ మహిళా సమాఖ్య (ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ)జిల్లా కార్యదర్శి రెంటాల కుమారి అన్నారు. గుంటూరు కొత్తపేటలోని సీపీఐ జిల్లా కార్యాలయం మల్లయ్య లింగంభవన్‌ నుంచి భగత్‌ సింగ్‌ విగ్రహం వరకు సోమవారం నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కర్ణాటక రాష్ట్రంలో మహిళలు, యువతులపై హత్యలు, అత్యాచారాల పరంపర మనసును కలిచి వేస్తోందని తెలిపారు. ఆశ్రమాలు, ఆలయాలు ఆధ్యాత్మిక చింతన, భక్తి పేరుతో మహిళలను వంచిస్తున్నాయని ఆరోపించారు. సమాజంలో పలువురు పెద్ద మనుషులుగా, మత గురువులుగా చలామణి అవుతూ మహిళల మాన ప్రాణాలను హరించివేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రభుత్వం ఆలస్యంగా ప్రత్యేక దర్యాప్తు బందాన్ని ఏర్పాటు చేసిందని విమర్శించారు. మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెన్మెత్స దుర్గాభవాని మాట్లాడుతూ బీజేపీ నాయకులే మంజునాథ్‌ దేవాలయం ట్రస్టీలుగా ఉన్నారని, వారి కనుసన్నల్లోనే ఈ అరాచకాలన్నీ జరిగాయని తెలుస్తోందన్నారు. ధర్మస్థల ఉదంతంపై దర్యాప్తును వేగవంతం చేయాలని, దోషులను కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement