
గంజాయి విక్రయ ముఠా అరెస్ట్
తెనాలి రూరల్: పట్టణంలో గంజాయిను విక్రయిస్తున్న ముఠాని తెనాలి రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. 13 మంది నుంచి రూ. 3.15 లక్షల విలువైన 21 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. తెనాలి డీఎస్పీ కార్యాలయంలో సోమవారం సాయంత్రం జరిగిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ వివరాలు వెల్లడించారు. పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారంతో రూరల్ సీఐ ఆర్. ఉమేష్ సిబ్బందితో కలిసి అంగలకుదురు గ్రామ శివారు ఐస్ ఫ్యాక్టరీ ప్రాంతంలోని నిమ్మ తోటలలో గంజాయి విక్రయిస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు. ముఠా జల్సాలకు అలవాటు పడి ఒడిశా నుంచి కొనుగోలు చేసి ఇక్కడ అమ్ముతోంది. సంగం జాగర్లమూడికి చెందిన అబ్దుల్ రషీద్, పట్టణంలోని సీఎం కాలనీకి చెందిన షేక్ నాగూర్, ముత్తెంశెట్టివారిపాలేనికి చెందిన రాహుత్ సాల్మన్ అలియాస్ కాటరాజు, పట్టణ పినపాడు గేట్ సమీపంలో నివసించే బలసాని ప్రభాస్ అలియాస్ పండు (మైనర్), ప్రత్తిపాడుకు చెందిన షేక్ గౌస్, ఒడిశాకి చెందిన (ప్రస్తుతం గుంటూరు మండలం దాసరిపాలెంలో ఉంటున్న) బసంతి నాయక్ అలియాస్ సమీర్ నాయక్, విజయవాడ గొల్లపూడికి చెందిన గొర్ల వెంకటేష్, తెనాలి మండలం నందివెలుగు గ్రామానికి చెందిన షేక్ నసీరుద్దీన్, పట్టణంలోని గంగానమ్మపేటకు చెందిన నూనె విజ్ఞమణికుమార్ సాయి అలియాస్ గని, అయితానగర్‌కు చెందిన గుంజి నాగమల్లేశ్వరరావు, జొన్నాల సాయిసిద్ధు(మైనర్), పట్టణంలోని ప్యాడిసన్‌పేటకు చెందిన పల్లె సిద్ధు(మైనర్), గంగానమ్మపేటకు చెందిన కనపర్తి రాజా(మైనర్)లు పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో ఉన్నారు. ముఠాలో కొందరిపై ఇప్పటికే రౌడీ షీట్లు, సస్పెక్ట్ సీట్లు ఉన్నట్లు ఎస్పీ చెప్పారు. గంజాయి గురించి తెలిస్తే వెంటనే 1972 ఈగల్ నంబర్‌కి సమాచారం ఇవ్వాలని ఆయన ప్రజల్ని కోరారు. కేసును ఛేదించి నిందితులను అరెస్ట్ చేసిన రూరల్ పోలీసులకు ప్రత్యేక ప్రోత్సాహాలను జిల్లా ఎస్పీ సతీష్ అందజేశారు. సమావేశంలో డీఎస్పీ బి. జనార్దనరావు, రూరల్ సీఐ ఉమేష్, ఎస్‌ఐ ఆనంద్, కొల్లిపర ఎస్‌ఐ కోటేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు.
21 కిలోల సరకు స్వాధీనం 13 మంది అరెస్ట్
నిందితుల్లో నలుగురు మైనర్లు

గంజాయి విక్రయ ముఠా అరెస్ట్