
పుట్ట గొడుగుల పెంపకంపై శిక్షణ తరగతులు
గుంటూరు రూరల్: నగర శివారుల్లోని లాంఫాం నందున్న కృషి విజ్ఞాన కేంద్రంలో సోమవారం గ్రామీణ యువతకు పుట్టగొడుగుల పెంపకంపై శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వారం రోజుల పాటు జరిగే ఈ శిక్షణ తరగతుల ప్రారంభానికి కేవీకే ప్రధాన శాస్త్రవేత్త ఎం.యుగంధర్‌కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతీ, యువకులకు స్వయం ఉపాధిపై శిక్షణ ఇచ్చి, వారి ఉన్నతికి కృషిచే స్తున్నామని తెలిపారు. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. కోర్స్ డైరెక్టర్, సీనియర్ శాస్త్రవేత్త ఎం. గంగాదేవి పాలపుట్ట, ఆయిస్టర్, వరిగడ్డి, బటన్ పుట్టగొడుగుల సాగు, వాటి జీవిత చక్రాన్ని వివరించారు. అనంతరం విద్యార్థులకు శిక్షణ కిట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో జేఎన్‌ఎం పుణ్యవతి, కేవీకే శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.
ఐఆర్‌సీటీసీ ఆధ్వర్యంలో పంచ్ జ్యోతిర్లింగ్ యాత్ర
●ఆగస్టు 16 నుంచి 24వ తేదీ వరకు నిర్వహణ
●వివరాలు వెల్లడించిన ఏరియా మేనేజర్ ఎం.రాజా
లక్ష్మీపురం: ఇండియన్ రైల్వే క్యాటరింగ్, టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఆర్‌సీటీసీ) ఆధ్వర్యంలో సికింద్రాబాద్ నుంచి పంచ్ జ్యోతిర్లింగ్ దర్శన్‌తో అంబేడ్కర్ యాత్రను నిర్వహించనున్నట్లు ఏరియా మేనేజర్ ఎం.రాజా సోమవారం తెలిపారు. యాత్ర ఆగస్టు 16 నుంచి 24వ తేదీ వరకు కొనసాగుతుందని పేర్కొన్నారు. జ్యోతిర్లింగ దర్శనాలలో ప్రధానంగా నాగపూర్‌లో అంబేడ్కర్ బౌద్ధ మతాన్ని స్వీకరించిన దీక్షా భూమి స్తూపం, శ్రీ స్వామినారాయణ మందిరం, ఉజ్జయిన్ మహాకాళేశ్వర జ్యోతిర్లింగం, ఓంకారేశ్వర జ్యోతిర్లింగం, అంబేడ్కర్ జన్మస్థలం, నాసిక్ త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం, పూణేలో భీమ శంకర్ జ్యోతిర్లింగం, ఔరంగాబాద్‌లో గ్రిష్ణేశ్వర జ్యోతిర్లింగం దర్శన ఉంటుందని వివరించారు. యాత్ర సికింద్రాబాద్ నుంచి నిజామాబాద్ మీదుగా సాగుతుందని తెలిపారు. ఒక్కో వ్యక్తికి స్లీపర్ క్లాస్ పెద్దలయితే నాన్ ఏసీ గద్దుల్లో హోటల్ వసతి, నాన్ ఏసీ వాహనంతో కలిపి రూ.14,700, త్రీ ఏసీ అయితే ఏసీ గది, నాన్ ఏసీ వాహనంతో కలిపి రూ.22,900 ఉంటుందని వివరించారు. టూ ఏసీ అయితే ఏసీ గది, ఏసీ వాహనంతో కలిపి రూ.29,900, పిల్లలు 5 సంవత్సరాల నుంచి 11 సంవత్సరాల లోపు వారికి స్లీపర్ క్లాస్ రూ.13,700, త్రీ ఏసీ రూ.21,700, టూ ఏసీ రూ.28,400 ఉంటుందని తెలిపారు. యాత్రికులకు ప్రతి రోజు ఉదయం టీ, అల్పాహారం, భోజనం, రాత్రి భోజనం (శాఖాహారం మాత్రమే), ప్రయాణ బీమా, వృత్తిపరమైన, స్నేహపూర్వక పర్యటన ఎస్కార్ట్ సేవలు, రైలులో భద్రత, అవసరమైన సహాయం కోసం ఐఆర్‌సీటీసీ మేనేజర్లు టూర్ అంతటా ప్రయాణిస్తారని తెలియజేశారు. అన్ని రకాల పన్నులు వర్తిస్తాయని తెలిపారు. యాత్ర కోసం ఐఆర్‌సీటీసీ రైల్వే రిటైరింగ్ రూమ్, విజయవాడ రైల్వే స్టేషన్, ఫోన్ నంబర్ 9281495848ను సంప్రదించాలని ఆయన సూచించారు.