
గోవుల సంరక్షణలో అశ్రద్ధ పనికిరాదు!
తాడేపల్లి రూరల్ : గోవుల సంరక్షణలో అశ్రద్ధ పనికిరాదని, జిల్లాలోని ఏ గోశాలలోనూ ఇంతటి దారుణమైన పరిస్థితి లేదని జిల్లా పశు సంవర్ధక శాఖ జేడీ సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. యర్రబాలెంలోని శ్రీ కృష్ణానంద ఆశ్రమం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గోశాలను సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. గోశాల నిర్వహణపై పలువురు సామాజిక మాద్యమాల ద్వారా ఫిర్యాదుతో ఆయన మంగళగిరి కమిషనర్ అలీమ్ బాషా, తహసీల్దార్ దినేష్ రాఘవేంద్రలతో కలసి గోశాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జాయింట్ డైరెక్టర్ సత్యనారాయణ గోశాల నిర్వాహకులు సతీష్‌ను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం అధికారులతో కలసి గోశాల ఆవరణను పరిశీలించారు. ఓ షెడ్డులో గో మూత్రం, పేడతో నిండిపోయి దుర్వాసన రావడాన్ని గమనించి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు మృత్యువాత పడిన గోవులపై ఆరా తీశారు. ప్రస్తుత వర్షాకాలంలో గోవులు అనారోగ్యం బారిన పడే ప్రమాదముందని తెలిపారు. ఎండా కాలంలోనూ మృత్యువాత పడే ప్రమాదం ఉందని, జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. గోశాల అస్తవ్యస్త నిర్వహణపై నివేదిక సిద్ధం చేసిన ప్రభుత్వానికి పంపనున్నట్లు జేడీ సత్యనారాయణ తెలిపారు.
యర్రబాలెం గోశాలను తనిఖీ చేసిన జేడీ
అపరిశుభ్రతపై ఆగ్రహం

గోవుల సంరక్షణలో అశ్రద్ధ పనికిరాదు!