
దళిత సర్పంచ్‌పై సీఐ దాడి దుర్మార్గం
పర్చూరు(చినగంజాం): కారంచేడు మండలం దగ్గుబాడు మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్, దళితుడు గేరా రవీంద్రనాథ్ ఠాగూర్‌పై సీఐ దాడి దుర్మార్గమని వైఎస్సార్ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పాలెపోగు రాంబాబు పేర్కొన్నారు. సీఐ తీరుని నిరసిస్తూ సోమవారం దళిత నాయకులు సమావేశమయ్యారు. రాంబాబు మాట్లాడుతూ కారంచేడు పోలీస్‌స్టేషన్‌లో రౌడీషీట్ ఉన్న కారణంగా రవీంద్రనాథ్ ఠాగూర్ ఈనెల 19వ తేదీ శనివారం పోలీస్ నిబంధనలకు అనుగుణంగా కౌన్సెలింగ్‌కు హాజరయ్యారని తెలిపారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ కూర్చొనే గదిలో ఆయన కుర్చీ వెనుక ఉన్న అంబేడ్కర్ చిత్రపటాన్ని తొలగించి సీఎం, డిప్యూటీ సీఎం, స్థానిక ఎమ్మెల్యే చిత్రపటాలను పెట్టాలని సీఐ హెచ్చరించినట్లు తెలిపారన్నారు. సీఎం, డిప్యూటీ సీఎం చిత్రపటాలు పెట్టే విషయంలో ప్రభుత్వ అధికారులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని, ఒక ప్రజాప్రతినిధికి అతని ఆసక్తిపై ఆధారపడి ఉంటుందని, అప్పటికే సదరు చిత్రపటాలను తన గదిలో ఎదురుగా పెట్టుకున్నాడని ఆ విషయాన్ని ఉద్దేశించి అతనిపై చేయిచేసుకోవడం సమంజసం కాదన్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఇటువంటి సంస్కృతిని ప్రోత్సహించ లేదని, లా అండ్ ఆర్డర్‌ను అతిక్రమించిన వారిపై పోలీస్‌లు చేయిచేసుకోవడం సమర్థనీయం కాదన్నారు. ఈ విధంగా చిత్రపటాలను పెట్టే అంశాలను రాజకీయం చేయడం తగదని, రాజకీయ ప్రలోభాలకు, స్థానిక నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి పోలీసులు ఈ విధంగా ప్రవర్తించడం సరైన విధానం కాదన్నారు. సమావేశంలో దగ్గుబాడు సర్పంచ్ గేరా రవీంద్రనాథ్ ఠాగూర్, గేరా స్వరాజ్ కుమార్, కూరాకుల ఇస్సాక్, గుజ్జనగుండ్ల చిన్న తదితర దళిత నాయకులు పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పాలెపోగు రాంబాబు