రైతు ఊపిరితీస్తున్న బ్లాక్‌ బర్లీ | - | Sakshi
Sakshi News home page

రైతు ఊపిరితీస్తున్న బ్లాక్‌ బర్లీ

May 20 2025 1:14 AM | Updated on May 20 2025 1:14 AM

రైతు

రైతు ఊపిరితీస్తున్న బ్లాక్‌ బర్లీ

● పేరుకుపోయిన పొగాలు నిల్వలు ● కొనుగోలుకు ఆసక్తి చూపని టుబాకో కంపెనీలు ● పట్టించుకోని కూటమి ప్రభుత్వం ● బాధ తట్టుకోలేక ఓ రైతు ఆత్మహత్య ● ప్రభుత్వం ఆదుకోకుంటే అందరిది అదే బాట అంటున్న రైతులు

సాక్షి ప్రతినిధి,బాపట్ల: పండించిన పొగాకు పంట మొత్తాన్ని కొంటామని హామీ ఇచ్చిన టుబాకో కంపెనీలు ఈ ఏడాది ఒక్క క్వింటా కూడా కొనక అన్నదాతలను వంచించాయి. రైతులను ఆదుకోవాల్సిన చంద్రబాబు ప్రభుత్వం ముఖం చాటేసింది. ఇప్పటికే పర్చూరు మండలం వీరన్నపాలెంకు చెందిన రైతు ఉప్పుటూరి సాంబశివరావు ఆత్మహత్య చేసుకోగా మరికొందరు అదేబాటలో ఉన్నారు. వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం క్వింటా పొగాకుకు రూ.15 నుంచి రూ.18 వేల ధర ఇచ్చి రైతులను ఆదుకోగా కూటమి ప్రభుత్వం రైతులను గాలికి వదిలేసింది. బయట మార్కెట్‌లో క్వింటా రూ.5 వేలకు అమ్ముకోలేక రైతులు విలపిస్తున్నారు. అప్పులోళ్ల ఒత్తిళ్లు పెరగడంతో ఆందోళన చెందుతున్నారు. పొగాకు రైతుల కష్టాలు తెలుసుకునేందుకు ‘సాక్షి’ ఇంకొల్లు మండలం వంకాయలపాడు, సుబ్బారెడ్డిపాలెం, పర్చూరు మండలం ఉప్పు టూరు, వీరన్నపాలెం గ్రామాల్లో పర్యటించింది.

కష్టమంతా వర్షార్పణం

ఇంకొల్లు మండలం వంకాయలపాడు చేరుకోగా ముందు రోజు రాత్రి కురిసిన వర్షానికి పొగాకు తడిసిపోయింది. కొందరు రైతులు తడిసిన పొగాకును ఆరబెట్టుకుంటున్నారు. మరికొందరు ప్లాస్టిక్‌ పట్టలు కప్పి కాపాడుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. రైతు రామలింగారెడ్డి రూ.12 లక్షలు పెట్టుబడులు పెట్టి 8 ఎకరాలలో సాగు చేసిన బ్లాక్‌ బర్లీ పొగాకు మొత్తం వర్షానికి తడిసిపోయింది. ఇంటి మనుషులతోపాటు కూలీలను పెట్టి రోడ్డుపైనే ఆరబెట్టుకుంటున్నాడు. పొగాకు కొంటామని చెప్పి జీపీఐతోపాటు మిగిలిన టుబాకో కంపెనీలు మోసం చేశాయని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

జిల్లాలో బ్లాక్‌బర్లీ సాగు ఇలా....

బాపట్ల జిల్లాలోని పర్చూరు, అద్దంకి నియోజకవర్గాల్లో బ్లాక్‌బర్లీ, వైట్‌ బర్లీ, ఎఫ్‌సీవీ పొగాకు కలిపి 63,471 ఎకరాల్లో సాగుకాగా ఒక్క బ్లాక్‌ బర్లీ 53,067 ఎకరాల్లో సాగైంది. పర్చూరు నియోజకవర్గంలోనే 52,989 ఎకరాల్లో సాగుచేశారు. ఇప్పటివరకూ 5.60 లక్షల క్వింటాళ్లకు పైగా పొగాకు రైతుల వద్దే ఉండిపోయింది.

ఊరంతా పొగాకు గుట్టలే...

ప్రభుత్వం ఆదుకోవాలి

పర్చూరు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో వేలాది మంది రైతులు బ్లాక్‌ బర్లీ సాగుచేశారు. పంట చేతికొచ్చి నెల అవుతున్నా కంపెనీలు క్వింటా కూడా కొనలేదు. కంపెనీలు ఇచ్చిన హామీతోనే రైతులు పొగాకు సాగుచేశారు. తక్షణం ప్రభుత్వం స్పందించి రైతుల వద్ద ఉన్న పొగాకు వెంటనే గిట్టుబాటు ధరకు కొనుగోలు చేయాలి. లేకపోతే రైతులతో కలిసి ఆందోళనకు దిగుతాం.

–గాదె మధుసూదనరెడ్డి, వైఎస్సార్‌ సీపీ పర్చూరు నియోజకవర్గ సమన్వయకర్త

ఇంత దుస్థితి ఎన్నడూ లేదు

గత ప్రభుత్వంలో క్వింటా బ్లాక్‌ బర్లీ రూ.18 వేలకు తగ్గకుండా కొన్నారు. గుళ్లాకు సైతం రూ.9 వేలకు కొన్నారు. ఇప్పడు రూ.6 వేలకు కూడా కొనేవారు లేరు. నేను ఐదెకరాలు సాగుచేస్తే దాదాపు రూ.8 లక్షలు పెట్టుబడి పెట్టాను. కూలీలకు కూడా డబ్బులు కట్టలేకున్నాం.

వంకాయలపాటి సాంబశివరావు, రైతు, వంకాయలపాడు, ఇంకొల్లు మండలం

వంకాయలపాడు గ్రామంలో 100 మంది రైతులు 400 ఎకరాల్లో బ్లాక్‌ బర్లీ సాగుచేశారు. సుబ్బారెడ్డిపాలెం గ్రామంలో 120 మంది రైతులు 500 ఎకరాల్లో పొగాకు సాగుచేశారు. ప్రభు త్వం వెంటనే పొగాకు కొనిపించకపోతే చాలామంది రైతులు ప్రాణాలు బలిపెట్టుకుంటారని రైతు సంజీవరెడ్డితోపాటు మిగిలినవారు వాపోయారు. ఉప్పుటూరు చెరువు పక్కన రోడ్డుపైన ఉన్న ఖాళీ స్థలంలో వందలాది కౌలు రైతు ల పొగాకు గుట్టలుగా కనిపించాయి. 10 ఎకరాలు సాగుచేసిన సుధాకర్‌, 15 ఎకరాలు పండించిన అబ్దుల్‌ రజాక్‌, 20 ఎకరాలు వేసిన కోట య్య, 10 ఎకరాలు వేసిన బాల కోట య్య, 30 ఎకరాలు సాగు చేసిన షేక్‌ మొహిద్దీన్‌, 5 ఎకరాల షేక్‌ హషన్‌ బాషా, 14 ఎకరాల అప్పారావుతోపాటు అందరూ కష్టాలు ఏకరువు పెట్టారు. ఒక్క ఉప్పుటూరులోనే ప్రస్తుతం వెయ్యిలారీల పొగాకు సిద్ధంగా ఉందన్నారు.

క్వింటా కూడా కొనలేదు

10 ఎకరాలు కౌలుకు తీసుకొని రూ.15 లక్షలు పెట్టుబడి పెట్టి పంట సాగు చేశా. కంపెనీలు ఒక్క క్వింటా కూడా కొనలేదు. గత ప్రభుత్వంలో మాదిరి ధర ఉండి ఉంటే రూ.21.60 లక్షలు వచ్చేదని, ప్రస్తుత ధరకు అమ్మితే రూ.6 లక్షలు కూడా రాదు. –వంకాయలపాటి రఘుబాబు

రైతు ఊపిరితీస్తున్న బ్లాక్‌ బర్లీ 1
1/4

రైతు ఊపిరితీస్తున్న బ్లాక్‌ బర్లీ

రైతు ఊపిరితీస్తున్న బ్లాక్‌ బర్లీ 2
2/4

రైతు ఊపిరితీస్తున్న బ్లాక్‌ బర్లీ

రైతు ఊపిరితీస్తున్న బ్లాక్‌ బర్లీ 3
3/4

రైతు ఊపిరితీస్తున్న బ్లాక్‌ బర్లీ

రైతు ఊపిరితీస్తున్న బ్లాక్‌ బర్లీ 4
4/4

రైతు ఊపిరితీస్తున్న బ్లాక్‌ బర్లీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement