ఆదివాసీలపై దాడులను ఆపేయాలి
కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌చేసిన ప్రజాసంఘాల ఐక్యవేదిక
చీరాల రూరల్: కగార్ పేరుతో కేంద్ర ప్రభుత్వం ఆదివాసీలపై చేస్తున్న దాడులను ఆపేయాలని ప్రజాసంఘాల ఐక్యవేదిన నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక సీనియర్స్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయంలో ప్రజాసంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నాయకులు రాష్ట్ర చేనేత జసనమాఖ్య నాయకులు మాచర్ల మోహనరావు, ఎరుకుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు నల్లబోతుల మోహన్‌కుమార్ ధర్మ, బీసీ ఫెడరేషన్ నాయకుడు ఊటూకూరి వెంకటేశ్వర్లు, సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు గాదె హరిహరరావు, పౌరహక్కుల సంఘం నాయకుడు బడుగు విమలాకర్‌లు మీడియా సమావేశం ఏర్పాటుచేసి మాట్లాడారు. మధ్య భారతదేశం అయిన ఛత్తీస్‌ఘడ్, ఝార్కండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాలలోని సహజవనరులైన ఖనిజ సంపదను భవిష్యత్ తరాలకు అందించడంతో పాటు పర్యావరణ సమతుల్యాన్ని కాపాడుకోవడం కోసం ఆదివాసీలు అడవులను, అడవుల్లోని ఖనిజ సంపదను కాపాడుతుంటే కేంద్ర ప్రభుత్వం కొన్ని బహుళజాతి కంపెనీలకు ఆయా సంపదలను కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నది వారు ఆరోపించారు. అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర బలగాలను, సైన్యాన్ని ఉపయోగించి మావోయిస్టులను ఏరివేస్తున్నట్లు నటిస్తూ అడవులలో జీవిస్తున్న ఆదివాసీలపై దాడులు చేయిస్తుందని విమర్శించారు. ఆదివాసీలకు ప్రత్యేకంగా ఉన్న రాజ్యాంగంలోని షెడ్యూల్ 5లోని షెడ్యూల్ కుమాలు, షెడ్యూలు ప్రాంతాలు రక్షణ చట్టం, ఫారెస్టు హక్కుల చట్టం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి చట్టం వంటి హక్కులను కాపాడాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీల హక్కులను కాలరాస్తు ఆదివాసీలను అడవులలో ఉండకుండా దూరం చేస్తుందని ఆరోపించారు. గత 18 నెలలుగా మావోయిస్టుల పేరుతో ఆదివాసీలను హననం చేస్తున్నారని మండిపడ్డారు. మావోయిస్టులతో ప్రమాదమని కేంద్రం భావిస్తే వారితో చర్చలు జరిపి పరిష్కార దిశగా ఆలోచించాలి కానీ ఈవిధమైన ఘోరాలకు పాల్పడడం మంచిదికాదని వారు హితవు పలికారు. ఈ విషయమై మేధావులు, ప్రజా సంఘాలు, ప్రజలతో మంగళవారం రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు వారు పేర్కొన్నారు.


