●నీటిమూటలైన ఉన్నతాధికారుల హామీలు | - | Sakshi
Sakshi News home page

●నీటిమూటలైన ఉన్నతాధికారుల హామీలు

Nov 27 2026 1:38 AM | Updated on Nov 27 2026 1:38 AM

●నీటిమూటలైన ఉన్నతాధికారుల హామీలు

● పోలీసుల వత్తాసుతో

రెచ్చిపోయిన టీడీపీ శ్రేణులు

● ఏకపక్షంగా ఎన్నికల యంత్రాంగం.. రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం

● పోలింగ్‌ కేంద్రాలకు తాళాలు,

అభ్యర్థుల కిడ్నాప్‌లు, ఏకగ్రీవాల పేరిట అరాచకం

● రౌడీయిజం నడుమ ఎన్నికలను బహిష్కరించిన పలు గ్రామాల ఓటర్లు

రాయచోటి: రాజ్యాంగం ఎంత గొప్పదైనా.. దాన్ని అమలు చేసే పాలకులు, వ్యవస్థలు, రాజ్యాంగ సంస్థలు నిజాయితీగా, నిష్పక్షపాతంగా బాధ్యతలు నిర్వర్తించనప్పుడు ప్రజలకు ప్రాథమిక హక్కులు సైతం అందని ద్రాక్షగానే మిగిలిపోతాయి. పాలకులకు ప్రజాస్వామ్యం పట్ల నిబద్ధత, వ్యవస్థలకు చిత్తశుద్ధి కొరవడితే రాజ్యాంగ ఫలాలు సామాన్యుడికి దక్కవనేందుకు గురువారం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలే నిలువెత్తు నిదర్శనం. ఒకవైపు 77వ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా వేదికలపై నీతులు వల్లెవేస్తుంటే.. మరోవైపు క్షేత్రస్థాయిలో మాత్రం అదే రాజ్యాంగం కల్పించిన అత్యున్నత ఓటు హక్కును కాలరాసే కుట్రలు బరితెగించాయి. కులం, మతం, ప్రాంతం, ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా ప్రతి పౌరుడికీ ఒక ఓటు, ఆ ఓటుకు సమాన విలువను రాజ్యాంగం ప్రసాదించినప్పటికీ, క్షేత్రస్థాయిలో ఆ హక్కుకు సంకెళ్లు పడ్డాయి.

ఏకపక్షంగా ఎన్నికల యంత్రాంగం..

రాష్ట్ర ఎన్నికల సంఘం నేతృత్వంలోని జిల్లా యంత్రాంగం పూర్తి ఏకపక్షంగా వ్యవహరిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ ఆధిపత్యం అడుగడుగునా కనిపించింది. వైఎస్సార్‌సీపీ మద్దతుదారుల నామినేషన్లను అడ్డుకోవడం, బెదిరింపులు, అధికార దుర్వినియోగం, ఏకగ్రీవాల పేరుతో పోలీసులు వ్యవహరించిన తీరు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసింది. ఎన్నికల అక్రమాలపై వచ్చిన ఫిర్యాదులను నిష్పక్షపాతంగా పరిష్కరించడంలో యంత్రాంగం విఫలమవడంతో రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలుగుతోందని ప్రజాస్వామ్యవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రశ్నించే గొంతులను నొక్కేస్తూ, ప్రజాస్వామ్య సంస్థలను అధికార రాజకీయాలకు అనుగుణంగా మార్చుకోవడం వల్ల ఓటు హక్కు అమలులో అనిశ్చితి నెలకొందని ఆవేదన చెందుతున్నారు.

క్షేత్రస్థాయిలో బరితెగింపు..

ప్రజాస్వామ్యానికి తాళం!

అధికార పార్టీ నేతలు, కొందరు పోలీసుల కుమ్మక్కు కు సంబేపల్లి మండలంలోని ఘటనలే ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచాయి. రాయచోటి నియోజకవర్గంలోని 85 పంచాయతీల్లో 72 స్థానాలను దౌర్జన్యంతో ఏకగ్రీవం చేసుకున్నారనే ఆరోపణలు ఉండగా, పోలింగ్‌ జరిగిన చోట్ల సైతం అరాచకం రాజ్యమేలింది:

బూత్‌లకు తాళాలు, రిగ్గింగ్‌:

సంబేపల్లి పోలింగ్‌ కేంద్రం ప్రధాన ద్వారానికి తాళం వేసి, దళిత మహిళా సర్పంచ్‌ అభ్యర్థి కొప్పుల యశోదమ్మ, ఏజెంట్లను పోలీసులు లోపలికి రానివ్వకుండా అడ్డుకున్నారు. తెల్లవారేసరికి 500 ఓట్లు రిగ్గింగ్‌ చేశారని బాధితురాలు ఆరోపించారు. మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌ రెడ్డి, రాయచోటి మున్సిపల్‌ చైర్మన్‌ బోనమల ఖాదర్‌ బాషా నేరుగా బూత్‌లలోకి వెళ్లి ఓట్లు వేయించుకున్నారని ప్రతిపక్షం మండిపడింది.

అభ్యర్థి కిడ్నాప్‌..

ఎన్నికల బహిష్కరణ: రౌతుకుంట సర్పంచ్‌ అభ్యర్థి వేణుగోపాల్‌ రెడ్డిని టీడీపీ మూకలు కిడ్నాప్‌ చేయడంతో ఆయన కుమార్తె నిర్మల కన్నీటి పర్యంతమయ్యారు. రౌడీయిజం నడుమ జరుగుతున్న ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు రౌతుకుంట, సంబేపల్లి ఓటర్లు ప్రకటించారు.

పోలీసు వాహనంపైకెక్కి నిరసన:

శెట్టిపల్లి (సదిపిరాళ్లపల్లి, కస్బా) కేంద్రాలకు ఓటర్లను రానివ్వకపోవడంతో పాటు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి ఉపేంద్రరెడ్డిని అరెస్టు చేయడంపై గ్రామస్థులు తిరగబడ్డారు. మహిళలు పోలీసు వాహనాన్ని అడ్డుకుని, దానిపైకెక్కి రాయచోటి రూరల్‌ సీఐ ఉలసయ్య, ఎస్‌ఐ రవీంద్ర తీరును ఎండగట్టారు. రాజువారిపల్లి కేంద్రం వద్ద మాజీ సర్పంచ్‌ యువరాజు నాయుడు టీడీపీ శ్రేణుల దాడిలో గాయపడ్డారు.

జిల్లా కలెక్టర్‌, ఎస్పీలు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహిస్తామని ఇచ్చిన హామీలు కేవలం నీటిమూటలుగానే మిగిలిపోయాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజ్యాంగ దినోత్సవం సాక్షిగా ప్రజాస్వామ్య విలువలు మంటగలిశాయని ప్రజాసంఘాలు, మేధావులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement