ప్రైవేట్‌ డయాగ్నస్టిక్‌ కేంద్రాలపై కొరడా | - | Sakshi
Sakshi News home page

ప్రైవేట్‌ డయాగ్నస్టిక్‌ కేంద్రాలపై కొరడా

Nov 27 2026 1:38 AM | Updated on Nov 27 2026 1:38 AM

ప్రొద్దుటూరు క్రైం : జిల్లాలో అనధికారికంగా నిర్వహిస్తున్న డయాగ్నస్టిక్‌ సెంటర్లు, స్కానింగ్‌ కేంద్రాలు, క్లినికల్‌ ల్యాబ్‌లపై వైద్య ఆరోగ్యశాఖ అధికారులు కొరడా ఝులిపించారు. డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ యుగంధర్‌ ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. గురువారం ప్రొద్దుటూరులోని క్లినికల్‌ ల్యాబ్‌లు, డయాగ్నస్టిక్‌ సెంటర్లలో ముమ్మరంగా తనిఖీలు చేశారు. నిబంధనలను ఉల్లంఘించిన రెండు ల్యాబ్‌లను అధికారులు సీజ్‌ చేశారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ ప్రైవేట్‌ డయాగ్నస్టిక్‌ కేంద్రాలు, స్కానింగ్‌ సెంటర్లు, ల్యాబొరేటరీ ల్లో ప్రభుత్వ నిబంధనలు అమలు అవుతున్నాయా లేదా అనే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. కేంద్రాల అనుమతులు, రిజిస్ట్రేషన్‌ పత్రాలు, సాంకేతిక సిబ్బంది అర్హతలు, వైద్య పరీక్షలకు ఉపయోగించే పరికరాల నిర్వహణ, పరిశుభ్రత, పరీక్షల రికార్డులు, రోగులకు అందిస్తున్న సేవలను తనిఖీల్లో పరిశీలించినట్లు వెల్లడించారు. అనమతులు లేకుండా కేంద్రాలను నిర్వహించడం, రిజిస్ట్రేషన్‌ లేకుండా వైద్య పరీక్షలు చేయడం, అర్హత లేని సిబ్బందితో పరీక్షలు నిర్వహించడం, నిబంధనలకు విరుద్ధంగా స్కానింగ్‌ సేవలు అందించడం, తప్పుడు పరీక్షా నివేదికలు ఇవ్వడం వంటి అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఉల్లంఘనల తీవ్రతను బట్టి నోటీసులు జారీ చేయడంతో పాటు కేంద్రాలను సీజ్‌ చేయడం, రిజిస్ట్రేషన్లు రద్దు చేయడం, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ముఖ్యంగా అల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌ కేంద్రాలు పీసీపీఎన్‌డీటీ చట్టం నిబంధనలకు లోబడి పని చేయాలని అధికారులకు సూచించారు. వైద్య పరీక్షలు చేయించుకునే ముందు సంబంధిత కేంద్రానికి అవసరమైన అనుమతులు, రిజిస్ట్రేషన్‌ ఉన్నాయో లేదో ప్రజలు నిర్ధారించుకోవాలని కోరారు. జిల్లాలో అనధికారికంగా నిర్వహిస్తున్న డయాగ్నస్టిక్‌ కేంద్రాలు, ల్యాబొరేటరీలపై నిరంతరం తనిఖీలు కొనసాగుతాయని డీఎంహెచ్‌ఓ స్పష్టం చేశారు. నిబంధనలను ఉల్లంఘించే వారిపై ఎలాంటి ఉపేక్ష లేకుండా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

అమ్మా మన్నించు

ప్రొద్దుటూరు కల్చరల్‌ : మైదుకూరు రోడ్డులోని ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద ఉన్న సావిత్రిబాయి పూలే విగ్రహానికి బుధవారం రాత్రి దుండగులు చెప్పుల దండ వేసి అవమానించారు. మహిళా విద్య కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహనీయురాలికి జరిగిన ఈ అవమానం యావత్‌ మహిళా లోకానికి జరిగినదిగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అడిషనల్‌ జనరల్‌ సెక్రటరీ వెంకటకృష్ణయ్య యాదవ్‌ ఖండించారు. బాధ్యులను పోలీసులు తక్షణమే అరెస్టు చేసి శిక్షించాలన్నారు. దీనికి నిరసనగా శుక్రవారం విగ్రహం వద్ద చేపట్టనున్న ఆందోళనలో మేధావులు, మహిళలు, బీసీ నాయకులు పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.

జాతీయస్థాయి పోటీలకు ఎంపిక

పులివెందుల రూరల్‌ : నల్లపురెడ్డిపల్లె జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థినులు జాతీయస్థాయి హ్యాండ్‌బాల్‌ పోటీలకు ఎంపికై నట్లు ప్రధానోపాధ్యాయుడు రవిచంద్రారెడ్డి తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్‌ పోటీల్లో తమ పాఠశాలకు చెందిన ఎం.లిఖిత, ఎం.గీత ప్రతిభ కనబరిచి కాంస్య పతకం సాధించారన్నారు. ఈ నెల 28వ తేదీ నుంచి జరిగే జాతీయస్థాయి పోటీల్లో వీరిద్దరూ రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం వహించనున్నట్లు వివరించారు.

అండర్‌–17 క్రికెట్‌ వైస్‌ కెప్టెన్‌గా సాద్‌ ఇర్ఫాన్‌

ప్రొద్దుటూరు కల్చరల్‌ : వైఎస్సార్‌ కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణానికి చెందిన సాద్‌ ఇర్ఫాన్‌ అండర్‌–17 జాతీయ క్రికెట్‌ జట్టుకు ఎంపికయ్యాడు. స్థానిక గౌతమ్‌ హైస్కూల్‌లో 9వ తరగతి చదువుతున్న ఇర్ఫాన్‌.. 14 ఏళ్లకే అండర్‌–17 జట్టుకు వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించే అరుదైన అవకాశం దక్కించుకున్నాడు. గతేడాది రాజస్థాన్‌లో జరిగిన అండర్‌–14 జాతీయ స్థాయి పోటీల్లోనూ వైస్‌ కెప్టెన్‌గా రాణించాడు. డిసెంబర్‌ 10 నుంచి మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో జరగనున్న జాతీయ స్థాయి క్రికెట్‌ పోటీల్లో ఇర్ఫాన్‌ పాల్గొననున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement