సోదరభావానికి నిదర్శనం! | - | Sakshi
Sakshi News home page

సోదరభావానికి నిదర్శనం!

Nov 27 2026 1:38 AM | Updated on Nov 27 2026 1:38 AM

గాలివీడు: కులమతాలకు అతీతంగా మానవత్వమే మిన్న అని గాలివీడు ముస్లిం సోదరులు చాటిచెప్పారు. శబరిమల అయ్యప్పస్వామి దర్శనానికి బయలుదేరిన మాలధారులకు గురువారం గోరాన్‌ చెరువు వద్ద అత్యవసర మందులతో కూడిన మెడికల్‌ కిట్లు, పండ్లను పంపిణీ చేసి ఆత్మీయంగా సాగనంపారు. కార్యక్రమంలో అమీన్‌, అమీర్‌, ఎస్‌కే నిజాముద్దీన్‌, సలీం, కరమల మక్సూద్‌, బావ, షాహీర్‌, నాగభాష, యూనిస్‌, జైద్‌, సమీవుల్లా, ఖలీద్‌, ఎజాస్‌, అర్షద్‌ ఖాన్‌, గుజరీ గోర, నిజాం (మొబైల్‌) తదితరులు పాల్గొన్నారు.

నేడు జాబ్‌మేళా

పుంగనూరు: పుంగనూరు పట్టణంలోని శుభారాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్‌ అన్నార్‌ గురువారం తెలిపారు. ఈ కార్యక్రమానికి వివిధ కంపెనీల ప్రతినిధులు హాజరవుతారని పేర్కొన్నారు. డిగ్రీ, ఇతర విద్యార్హత కలిగిన యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ విద్యార్హత ధ్రువపత్రాలు, ఆధార్‌కార్డు, బయోడేటా తీసుకురావాలని సూచించారు.

మిట్స్‌ వర్సిటీ వీసీగా ప్రొఫెసర్‌ సరాజు పి.మొహంతి

కురబలకోట: మదనపల్లె సమీపంలోని అంగళ్లులో ఉన్న మిట్స్‌ డీమ్డ్‌ టు బి యూనివర్సిటీ నూతన వైస్‌ ఛాన్సలర్‌గా ప్రొఫెసర్‌ సరాజు పి.మొహంతి నియమితులయ్యారు. గురువారం ఆయన వర్సిటీలో బాధ్యతలు స్వీకరించారు. ఈ నియామకాన్ని వర్సిటీ వ్యవస్థాపకులు, ఛాన్సలర్‌ డాక్టర్‌ ఎన్‌.విజయభాస్కర్‌ చౌదరి ప్రకటించారు. బాధ్యతల స్వీకరణ అనంతరం నిర్వహించిన సమావేశంలో వీసీ మొహంతి మాట్లాడుతూ.. విద్యార్థులకు నాణ్యమైన విద్య, సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించి మెరుగైన ఉపాధి కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమన్నారు. అనంతరం ప్రో–ఛాన్సలర్‌ ఎన్‌.ద్వారకనాథ్‌, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ కీర్తి నాదెళ్ల నూతన వీసీకి పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.

అధైర్యపడవద్దు

● సర్పంచ్‌ అభ్యర్థి కిడ్నాప్‌ ఘటనపై

కుటుంబ సభ్యులతో ఆరా

● నిష్పక్షపాతంగా విచారణ జరిపి

బాధ్యులపై చర్యలు తీసుకోవాలి

● వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

గడికోట శ్రీకాంత్‌ రెడ్డి

రాయచోటి : సంబేపల్లె మండల పరిధిలోని రౌతుకుంట సర్పంచ్‌ అభ్యర్థిగా వైఎస్‌ఆర్‌సీపీ మద్దతుతో పోటీ చేసిన వేణుగోపాల్‌రెడ్డి కుటుంబాన్ని గురువారం రాత్రి వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌రెడ్డి పరామర్శించారు. వేణుగోపాల్‌రెడ్డిని గురువారం తెల్లవారుజామున అధికార పార్టీకి చెందిన వ్యక్తులు కిడ్నాప్‌ చేసి , మత్తు ఇంజెక్షన్‌ ఇచ్చి బలవంతంగా కర్ణాటక రాష్ట్రంలోని బల్లారి తీసుకెళ్లినట్లు వైఎస్‌ఆర్‌సీపీ నేతలు ఆరోపించారు. గురువారం జరిగిన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా వైఎస్‌ఆర్‌సీపీ మద్దతుదారులను పోలింగ్‌ కేంద్రాల వద్దకు రానీయకుండా అడ్డుకున్నారని, పోలీసులే మాపై దౌర్జన్యాలకు పాల్పడ్డారని కుటుంబ సభ్యులు శ్రీకాంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం వేణుగోపాల్‌రెడ్డి కుటుంబ సభ్యులను జరిగిన ఘటనపై అన్ని వివరాలు శ్రీకాంత్‌రెడ్డి తెలుసుకున్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా విచారించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం సంబేపల్లె సర్పంచ్‌ అభ్యర్థి కొప్పుల యశోదమ్మ కుటుంబ సభ్యులతో పాటు వార్డు మెంబర్లను పరామర్శించారు. అధైర్యపడవద్దని భరోసా ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement