● వేర్వేరు ప్రాంతాల్లో వరుస చోరీలు..
● రూ.2.40 లక్షలు నగదు, బంగారం అపహరణ
వాల్మీకిపురం: మండలంలోని చింతపర్తిలో రెండు వేర్వేరు ప్రాంతాల్లో వరుస చోరీలు జరిగిన సంఘటన గురువారం రాత్రి చోటు చేసుకుంది. వివరాలు.. చింతపర్తి కోటవీధికి చెందిన బి.ఎస్. బాషా తన కుటుంబ సభ్యులతో కలిసి గుర్రంకొండ మండలం మర్రిపాడులోని బంధువుల ఇంటికి వెళ్లారు. ఈ క్రమంలో ఇంటికి తాళాలు వేసి ఉండటాన్ని గమనించిన గుర్తుతెలియని దుండగులు తలుపులు పగలగొట్టి లోపలికి చొరబడ్డారు. ఇంట్లోని బీరువా తలుపులు ధ్వంసం చేసి అందులో దాచిన రూ. 2 లక్షల నగదుతో పాటు బంగారు నగలను ఎత్తుకెళ్లారు. అలాగే, అదే గ్రామంలోని మకాన్వీధికి చెందిన లక్ష్మీదేవమ్మ కూడా తన ఇంటికి తాళాలు వేసుకొని బంధువుల ఇంటికి వెళ్లారు. శుక్రవారం ఉదయం ఆమె తిరిగి వచ్చి చూసే సరికి గుర్తుతెలియని దుండగులు ఇంటి తాళాలు పగలగొట్టి లోనికి ప్రవేశించినట్లు గుర్తించారు. బీరువా తలుపులను ధ్వంసం చేసి అందులో ఉన్న రూ. 40 వేల నగదు, ఐదు గ్రాములు గల రెండు బంగారు ఉంగరాలను అపహరించుకెళ్లారు. శుక్రవారం ఉదయం దొంగతనం జరిగిన విషయాన్ని గమనించిన బాధితులు స్థానిక ఎస్ఐ తిప్పేస్వామికి ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఎస్ఐ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


