● కూటమి పాలనలో గందరగోళంగా మారిన ‘నేతన్న సేవ’ పథకం
● వడపోత పేరిట కోత కోసేందుకు
‘సిక్స్ స్టెప్’ నిబంధనల ఉచ్చు
● మంత్రి ప్రకటనలు ఫ్లాప్.. వచ్చే నెలలోనే నిధులంటూ అధికారుల లీకులు
మదనపల్లి (కురబలకోట): రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ‘నేతన్న సేవ’ పథకం తొలి విడతలోనే చేనేత కార్మికులకు తీవ్ర నిరాశను మిగిల్చింది. అన్నమయ్య జిల్లాలో 5,069 మందిని అర్హులుగా గుర్తిస్తే.. కేవలం 3,869 మందికే లబ్ధి చేకూరింది. దీంతో వందలాది మంది చేనేత కార్మికుల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. రంగంలోకి దిగిన యంత్రాంగం మగ్గాల వద్దకే వెళ్లి సమగ్ర సర్వే నిర్వహించడంతో.. మొదటి విడత లబ్ధి పొందని వారితో పాటు కొత్తగా జిల్లాలో 4,908 మంది మలి విడత కోసం భారీగా దరఖాస్తు చేసుకున్నారు.
చేనేత గుండెల్లో ‘సిక్స్ స్టెప్’ గుబులు!
మరోవైపు లబ్ధిదారుల సంఖ్యను తగ్గించేందుకు ‘సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్’ పేరిట వడపోత సాగుతుండటం కార్మికులను భయాందోళనలకు గురిచేస్తోంది. గృహ విద్యుత్ వినియోగం, ఆదాయపు పన్ను, అర్బన్ హౌసింగ్, ఎక్కువ భూమి, ఫోర్ వీలర్ వంటి కారణాలతో నిజమైన నేతన్నలకే కోత కోసే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రభుత్వ డిజిటల్ డేటాలోని తప్పుల వల్ల నిజమైన చేనేత కార్మికుడికి అన్యాయం జరిగితే బాధ్యత ఎవరిదన్న ప్రశ్నకు సమాధానం కరువైంది.
మంత్రి హామీలు ఫ్లాప్.. వచ్చే నెలలోనే సేవ
ఈ నెలాఖరున మలి విడత కింత రూ.25 వేల చొప్పున నిధులు జమ చేస్తామని రాష్ట్ర చేనేత జౌళిశాఖ మంత్రి సవిత ప్రకటించినప్పటికీ, ఇప్పటివరకు లబ్ధిదారుల జాబితాపై స్పష్టత రాలేదు. దీంతో ఈ నెలలో నిధులు పడే అవకాశం లేదని, వచ్చే నెలలోనే జమ కానున్నాయని అధికారులు అంతర్గతంగా ఒప్పుకుంటున్నారు. అంగళ్లకు చెందిన చేనేత కార్మికుడు జి.కృష్ణారెడ్డి, మదనపల్లికి చెందిన కె.లక్ష్మీదేవిలు మాట్లాడుతూ.. 20 నుంచి 30 ఏళ్లుగా మగ్గం నేస్తున్నా తమకు సేవ అందలేదని, సచివాలయాల దగ్గరే కూర్చుని కంప్యూటర్ జాబితాలు ఖరారు చేస్తే నిజమైన నేతన్నలకు న్యాయం ఎలా జరుగుతుందని అధికారుల తీరును నిలదీశారు. ఈ మొత్తం వివాదంపై జిల్లా చేనేత జౌళి శాఖ అధికారి పవన్‌కుమార్‌రెడ్డిని వివరణ కోరగా.. అర్హత ఉండి తొలి విడతలో లబ్ధిపొందని చేనేత కార్మికులందరికీ మలి విడతలో నిధులు ఖచ్చితంగా జమ అవుతాయని, దీనిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.


