● చిప్పిలి, గుంటివారిపల్లిను పూర్తిగా నింపాలి
● సమీక్షలో కలెక్టర్ ఆదేశాలు
సాక్షి, మదనపల్లె: మదనపల్లె పట్టణంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే చిప్పిలి, గుంటివారిపల్లె సమ్మర్‌స్టోరేజీ ట్యాంకులను కృష్ణా జలాలతో నింపాలని కలెక్టర్ నిశాంత్‌కుమార్ జలవనరులశాఖ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో హంద్రీ–నీవా, వెలుగల్లు ప్రాజెక్టులు, ఇరిగేషన్, జలధార అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల రెండోవారంలో కృష్ణాజలాలు మదనపల్లెకు చేరే అవకాశం ఉండటంతో తాగునీటి అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వా లని ఆదేశించారు. చిప్పిలి ట్యాంకు బండ్‌ను తాత్కాలికంగా ఎత్తు పెంచే చర్యలు చేపట్టి అధిక నీటిని నిల్వ చేయాలని సూచించారు. గుంటివారిపల్లి ట్యాంకును కూడా నింపాలని ఆదేశించారు. హంద్రీనీవా ప్రధాన కాలువ ద్వారా వెలుగల్లు రిజర్వాయర్‌కు 50 శాతం నింపేలా కృష్ణాజలాలు తరలించాలని కోరారు. వచ్చేనెల మొదటి వారంలో ఈ చర్యలు ప్రారంభించాలన్నారు. జలధార కార్యక్రమంలో చేపడుతున్న జలధార ఫేజ్–2 పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. మంజూరైన పనులను సెప్టెంబర్‌లోగా పూర్తి చేయాలన్నారు. ఎస్‌ఈ విఠల్ ప్రసాద్, వెలిగల్లు ఈఈ భరత్ కుమార్ రెడ్డి, మదనపల్లె ఇరిగేషన్ ఈఈ సురేష్‌బాబు, రిటైర్డ్ ఎస్‌ఈ వెంకట్రామయ్య, డీఈలు, ఏఈలు, జేఈలు పాల్గొన్నారు.


