● పీజీఆర్‌ఎస్ తీరుపై జనం అసహనం
● సమస్య పరిష్కారం దొరక్క మండిపాటు
కురబలకోట: మదనపల్లి కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన పీజీఆర్‌ఎస్‌కు జిల్లా నలుమూలల నుంచి వివిధ సమస్యలపై అర్జీలు వెల్లువలా వచ్చాయి. కలెక్టర్ నిశాంత్ కుమార్, జేసీ శివ్ నారాయణ శర్మ, సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి తదితరులు అర్జీలు స్వీకరించారు. 316 దాకా అర్జీలు వచ్చినట్లు వెల్లడించారు. సమస్య పరిష్కారమవుతుందన్న ఆశతో పీజీఆర్‌ఎస్‌ను ఆశ్రయిస్తున్న అర్జీదారులకు ఎదురు చూపులు తప్ప పెద్దగా పరిష్కారాలు కన్పించడం లేదని అసహనం వ్యక్తమవుతోంది. ఒక్కసారి లేదా రెండు మార్లు అర్జీ ఇస్తే సమస్య పరిష్కారం కావాలి.. అదే సమస్యపై మళ్లీ మళ్లీ అధికారుల చుట్టూ తిరగాల్సి రావడం పీజీఆర్‌ఎస్ నిర్వహణ లక్ష్యం ఏమిటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కాగా పీజీఆర్‌ఎస్ అర్జీలు, రెవెన్యూ క్లీనిక్ అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి సత్వరం పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
అర్జీల్లో కొన్ని..
● హంద్రీనీవా కాలువ ద్వారా కురబలకోట మండలంలోని అంగళ్లుకు తాగునీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలని అలాగే తుంగావారిపల్లి, మల్లయ్యకొండకు రాకపోకలకు హంద్రీనీవా కాలువపై వంతెన నిర్మించాలని జిల్లా కలెక్టర్‌కు అర్జీ సమర్పించారు.
● పుంగనూరు మండలం నేటిగుంటవారిపల్లి పంచాయతీ ఆరంకుపల్లి, కంబవారిపల్లి, పీర్లవారి ఇండ్లు, దిగువకొండమీదపల్లి, ఆవులవారిపల్లి, ఏటిగడ్డ కమ్మపల్లి ఈ ఆరు పల్లెలకు రేషన్ షాపు 12 కిలోమీటర్ల దూరంలో ఉందని వీరికి సౌకర్యంగా దగ్గర్లో కొత్తగా రేషన్ షాపు మంజూరు చేయాలని ఆయా గ్రామాల ప్రజలు కోరారు.
● పెద్దల కాలం నుంచి సాగు చేసుకుంటున్న 1.92 ఎకరాల భూమి చుట్టూ కంచె వేశారని తగు విచారణ జరిపి తనకు న్యాయం చేయాలని కలకడ మండలం ముడియంవారిపల్లికి చెందిన షేక్ బాదుల్లా సాహేబ్ అర్జీ ఇచ్చారు.
● మదనపల్లి పట్టణం పుంగనూరు రోడ్డులో ఎంఎల్‌ఎల్ ఆసుపత్రి సమీపంలో 20 అడుగుల రోడ్డు స్థలాన్ని ఆక్రమించారని తగిన చర్యలు తీసుకుని ఆక్రమణలు తొలగించాలని స్థానికులు పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదుచేశారు.
● మదనపల్లి మండలం తట్టివారిపల్లి పంచాయతీ దేవతానగర్‌లో లే అవుట్‌కు కేటాయించిన పంచాయతీ స్థలం 29 సెంట్లను ఒకరు ఆక్రమించి విక్రయించడానికి చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవాలని స్థానికులు సోమవారం పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేశారు. వెంటనే తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.


