మైదుకూరు : మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని భూమాయపల్లె – కేశ లింగాయపల్లె గ్రామాల మధ్యలో మైదుకూరు – పోరుమామిళ్ల రహదారిపై బుధవారం సాయంత్రం ఎదురుగా వస్తున్న రెండు కార్లను ఓ కారు ఢీకొన్న సంఘటనలో 8 మందికి గాయాలయ్యాయి. వారిలో తీవ్రంగా గాయపడిన భార్యాభర్తలను మెరుగైన చికిత్స కోసం కడపకు తరలించారు. బాధితులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఆళ్లగడ్డకు చెదిన పోతులూరు ఆచారి తన కుమారుడు వేత విఖ్యాత్ పుట్టు వెంట్రుకలు తీయించేందుకు బ్రహ్మంగారిమఠానికి బంధుమిత్రులతో కలిసి ఓ కారు, లారీలో వెళ్లారు. కార్యక్రమం ముగియాగానే పోతులూరు ఆచారి, బంధువులైన ఈశ్వరమ్మ, వెంకటేశ్వర్లు, గోవిందయ్య, కుమారుడు వేద విఖ్యాత్ కారులో బయల్దేరారు. బంధువులు ఉన్న లారీ వెనుక అనుసరించింది. గిద్దలూరుకు చెందిన పల్లెపాల్ ప్రతాప్ అనే వ్యక్తి కడపలో ఉన్న తన కుమార్తె బ్యూలా గర్భిణిగా ఉండటంతో రెస్ట్ తీసుకునేందుకు తన బంధువు సుధీర్ బాబుతో కలిసి కడప నుంచి కారులో పిలుచుకొస్తున్నాడు. మైదుకూరు మండలం గంజికుంటకు చెందిన సునీల్, సునీత అనే భార్యాభర్తలు మల్లేపల్లెలో ఉన్న తన కుమార్తె వద్దకు కడప నుంచి కారులో బయలుదేరారు. ఈ మూడు కార్లు మైదుకూరు మున్సిపాలిటీలోని భూమాయపల్లె – కేశలింగాయపల్లె గ్రామాల మధ్యకు రాగానే ఆళ్లగడ్డకు చెందిన కారును డ్రైవింగ్ చేస్తున్న పోతులూరు ఆచారి తన ముందున్న ఓ వాహనాన్ని ఓవర్‌టేక్ చేసి ఎదురుగా వస్తున్న రెండు కార్లను ఒకదాని తర్వాత ఒక దానిని ఢీకొట్టాడు. సంఘటనలో గంజికుంటకు చెందిన సునీల్, సునీత, గిద్దలూరుకు చెందిన పాల్ ప్రతాప్, ఆళ్లగడ్డ కారును డ్రైవింగ్ చేస్తున్న పోతులూరు ఆచారికి తీవ్ర గాయాలయ్యాయి. పాల్ ప్రతాప్ కారు డ్రైవర్.. ఓనర్ అయిన సుదర్శన్, వెంకటేశ్వర్లు, ఈశ్వరమ్మ, గోవిందయ్యలకు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందగానే మైదుకూరు ఖాజీపేట 108 అంబులెన్స్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను మైదుకూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తాను గర్భిణిగా ఉండటంతో తాము ప్రయాణిస్తున్న కారును నెమ్మదిగా పోనిస్తున్నామని, బ్రహ్మంగారిమఠం నుంచి వస్తున్న కారు ఓ వాహనాన్ని ఓవర్ టేక్ చేసి తమ కారును, మరో కారును ఢీకొట్టినట్టు గిద్దలూరుకు చెందిన బ్యూలా తెలిపారు. మైదుకూరు పోలీసులు ప్రభుత్వాస్పత్రికి చేరుకుని సంఘటన వివరాలను నమోదు చేసుకున్నారు.
8 మందికి గాయాలు


