మదనపల్లె టౌన్ : ఒకే దేశం.. ఒకే పరీక్ష అంటూ విద్యార్థులను మోసగించడం అన్యాయం. నీట్ పరీక్ష స్కాంలతో 22 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారం అవుతుందని ఎస్‌ఎఫ్‌ఐ, ఎఐఎస్‌ఎఫ్ విద్యార్థి సంఘ నాయకులు ఆరోపించారు. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం మదనపల్లె కదిరి రోడ్డులో ధర్నా నిర్వహించారు. కేంద్ర పెట్టే పరీక్షను రద్దుచేసి రాష్ట్ర ప్రభుత్వాలే నీట్ ప్రవేశ పరీక్ష నిర్వహించాలని నినాదాలు చేశారు. వైద్య విద్యా ఆశావహులైన విద్యార్థులను మానసికంగా హింసించిన ఎన్డీయే సర్కార్ ప్రభుత్వం నుంచి తప్పుకోవాలని, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపించాలని ఏఐఎస్‌ఎఫ్ ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు మాధవ్, నరసింహ పేర్కొన్నారు. నీట్ పరీక్ష పేపర్ లీక్ చేసిన వారిని కఠినంగా శిక్షించాలంటూ నిరసన తెలిపారు. నీట్ స్కామ్ లకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్రన్ రాజీనామా చేయడంతో పాటు కేంద్రంలో ఉన్న ఎన్డీఎ ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. కేంద్రంలోని జేఈఈ, నీట్ పరీక్షలు నిర్వహించే ఎన్.టి.ఏను రద్దు చేసి రాష్ట్ర ప్రభుత్వాలకే అప్పగించాలన్నారు. దేశంలో వైద్య విద్య సంపన్న వర్గాల వారికి మాత్రమే అందేవిధంగా, సామాన్య వర్గాలకు చెందిన విద్యార్థులతో చెలగాటమాడడం అన్యాయమన్నారు. నీట్ పేపర్ లీక్ పై కేంద్రప్రభుత్వ సమగ్ర విచారణ జరపాలని, బాధ్యులకు కఠిన శిక్షలు పడేలా చూడాలని, విద్యార్థుల భవిష్యత్ ప్రమాదంలో పడకుండా తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్.ఎఫ్.ఐ జిల్లా ఉపాధ్యక్షుడు ఆఫ్రిద్, సుల్తాన్, యువరాజు, దినేష్, సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు.


