పోక్సో, కిడ్నాప్ కేసు నమోదు
ములకలచెరువు : మండలంలోని నాయనచెరువుపల్లెకు చెందిన జనసేన కార్యకర్త పోతుల హరినాథ్‌పై కిడ్నాప్, పోక్సో కేసు నమోదైంది. ఆయన మైనర్ బాలికను 19వ తేదీ రాత్రి ఇంటి నుంచి కిడ్నాప్ చేసి తీసుకెళ్లినట్లు బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. పోలీసులు బాలిక అదృశ్యమైనట్లు కేసు నమోదు చేసిన విషయం పాఠకులకు తెలిసిందే. కానీ బాలికను కిడ్నాప్ చేసిన హరినాథ్‌పై ఎటువంటి కేసు నమోదు చేయకపోవడంతో బాలిక తండ్రి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో ములకలచెరువు సీఐ వెంకటేషులు, ఎస్‌ఐ ప్రతాప్ విచారణ చేపట్టి బాలిక, నిందితుడు పోతుల హరినాథ్ కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో బాలికను ఐదు రోజుల క్రితం బెంగళూరులో ఇస్కాన్ టెంపుల్ వద్ద ఉండగా అదుపులోకి తీసుకొని విచారణ చేశారు. తర్వాత తిరుపతి చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పగించారు. అనంతరం బాలిక తండ్రి ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేపట్టిన ములకలచెరువు పోలీసులు పోతుల హరినాథ్‌పై కిడ్నాప్, పోక్సో కేసు నమోదు చేశారు. నిందితుడి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నట్లు ఎస్‌ఐ ప్రతాప్ తెలిపారు.


