పరిహారం.. ఫలహారం
ప్రభుత్వం మంజూరు చేసిన పరిహారం.. అధికారులకు ఫలహారంగా మారింది. ఖరీఫ్‌లో ఉల్లి పంట నష్టపోయిన చాలా మంది రైతులకు నష్ట పరిహారం అందలేదు. అర్హుల జాబితా తయారీలో అధికారులు చేతివాటం ప్రదర్శించారనే విమర్శలు ఉన్నాయి. పంట నష్టపోని రైతులకు పరిహారం అందడం.. ఇందుకు బలం చేకూరుస్తోంది. దీంతో అర్హులైన రైతులకు మొండి చేయి మిగిలింది.
నష్టపరిహారం రాలేదు
ఖరీఫ్‌లో ఎకరాకు రూ.70 వేలు ఖర్చు చేసి 2 ఎకరాలలో ఉల్లి పంట సాగు చేశాను. నేను సాగు చేసిన పంట నష్టపోయినా నష్టపరిహారం జాబితాలో నా పేరు లేదు. మా గ్రామంలో పంట సాగు చేయని రైతులకు నష్టపరిహారం వచ్చింది. నేను అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకోలేదు. అధికారులు చర్యలు తీసుకుని నాకు నష్టపరిహారం చెల్లించాలి.
– చంద్ర ఓబుళరెడ్డి,
ఉల్లి రైతు, ఎస్.చెర్లోపల్లె
సాగు చేయని రైతులకు వచ్చింది
ఉల్లి పంట సాగు చేసిన రైతులకు కాకుండా సాగు చేయని వారికి నష్టపరిహారం వచ్చింది. మా సచివాలయంలో పని చేస్తున్న వీహెచ్‌ఏ తన చేతివాటం ఉపయోగించి పంట వేయని రైతులకు జాబితాలో పేర్లు చేర్చి నష్టపరిహారం వచ్చేలా చేశారు. నేను ఉల్లి పంట సాగు చేస్తే నాకు ఇప్పటి వరకు పరిహారం రావడం లేదు. అధికారులకు ఫోన్లు చేస్తే సమాధానం లేదు. కార్యాలయంలో ఎవరూ అందుబాటులో ఉండటం లేదు. సంబంధిత అధికారులు చర్యలు తీసుకుని పంట నష్టపరిహారం ఇప్పించాలి.
– గంగిరెడ్డి, ఉల్లి రైతు, సంతకొవ్వూరు
సాక్షి టాస్క్‌ఫోర్స్: వైఎస్‌ఆర్ కడప జిల్లా వ్యాప్తంగా ఉల్లి పంట సాగులో నష్టం వాటిల్లింది. రైతులు లక్షలాది రూపాయలు ఖర్చు చేసి పంట సాగు చేస్తే దిగుబడి వచ్చినప్పటికీ.. మార్కెట్‌లో ధరలు లేకపోవడంతో తీవ్రంగా నష్టపోయారు. ఈ నేపథ్యంలో కొంత మంది పొలాల్లోనే ఉల్లి దిగుబడులను వదిలేసుకున్నారు. మరి కొంత మంది పశువులకు మేతగా ఇచ్చారు. దీంతో ప్రభుత్వం ఉల్లి పంట సాగు చేసి నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.20 వేల పరిహారం ఇస్తామని ప్రకటించింది. ఇదే అదునుగా కొంత మంది అధికారులు చేతివాటం ప్రదర్శించారు. పంట సాగు చేసిన రైతులకు కాకుండా, సాగు చేయని వ్యక్తులకు నష్టపరిహారం మంజూరు చేసి, కొంత తమ జేబులో వేసుకున్నారు. దీంతో అర్హులైన రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తొండూరు మండలంలో గోల్‌మాల్
జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్‌లో 20,300 ఎకరాల్లో ఉల్లి పంట సాగు చేశారు. తొండూరు మండలంలో దాదాపు 1600 ఎకరాలు సాగు చేసినట్లు అధికారులు నమోదు చేశారు. దీంతో 900 ఎకరాలకు మాత్రమే ప్రభుత్వం ఉల్లి పంటకు నష్టపరిహారం చెల్లించి చేతులు దులుపుకోవడంతో చాలా మంది రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని తొండూరు, బూచుపల్లె, సంతకొవ్వూరు, చెర్లోపల్లె, గంగనపల్లె, పాలూరు తదితర గ్రామాలలో ఉల్లి పంట సాగు చేసిన రైతులకు కాకుండా.. ఆయా గ్రామాల్లో పని చేస్తున్న విలేజ్ హార్టికల్చర్ అధికారులు తమ చేతివాటం ప్రదర్శించి.. ఎకరాకు రూ.2 వేల నుంచి రూ.5 వేల వరకు రైతులు, కొంత మంది మధ్యవర్తుల నుంచి వసూలు చేసుకుని ఉల్లి పంట సాగు చేసినట్లు జాబితాలో నమోదు చేశారు.
అధికారులకు ఫోన్ చేసినా..
పంట సాగు చేయని వారి ఖాతాలలో డబ్బు లు జమ కావడం వల్ల.. సాగు చేసిన రైతు లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందుకు సంబంధించిన అధికారులకు ఫోన్లు చేసినా అందుబాటులో లేకపోవడం, ఫోన్లు ఎత్తకపోవడంతో ఆయా సచివాలయాలతోపా టు ముద్దనూరులో ఉన్న హార్టికల్చర్ కార్యా లయానికి వెళ్లినా తమకు ఎలాంటి సమా ధానం రాలేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు చర్యలు తీసుకుని ఉల్లి పంట సాగు చేసిన వారికి పంట నష్టపరిహారం అందేలా చూడాలని రైతులు కోరుతున్నారు.
ఉల్లి రైతుకు కన్నీరు
పంట నష్టపోయిన వారికి
అందని సాయం
అనర్హుల ఖాతాలో నగదు జమ
అధికారుల చేతివాటమే కారణం
పరిహారం.. ఫలహారం
పరిహారం.. ఫలహారం
పరిహారం.. ఫలహారం


