అశ్వవాహనంపై అనంతమూర్తి
కడప సెవెన్‌రోడ్స్: దుష్ట సంహారం చేసేందుకు ఆయన ఖడ్గం చేతబూనాడు. ఉరకలేస్తున్న సమరోత్సాహంతో ఉత్తమ అశ్వంపై వేటకు బయలుదేరాడు. ఆ వీర గంభీర రూపం శత్రువులకు చూడగానే దడపుట్టించేలా ఉంది. దేవునికడప శ్రీ లక్ష్మి వెంకటేశ్వరస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం స్వామిని సర్వభూపాల వాహనంలో కొలువుదీర్చి మాడవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం ఆలయ ఇన్‌స్పెక్టర్ ఈశ్వర్‌రెడ్డి, టీటీడీ అధికారుల ఆధ్వర్యంలో అర్చకులు స్నపన తిరుమంజనం నిర్వహించారు. సాయంత్రం ఉల్లాస భరితంగా ఊయల సేవను నిర్వహించారు. విశేష సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. స్వామిని ఊయలలో ఉంచి శయనింపుగీతాలను ఆలపించారు. అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు స్వామికి ఊంజల గీతాలాపనలు చేశారు. రాత్రి కనుల పండువగా అలంకరించిన అశ్వవాహనంపై స్వామిని మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు ఆ దివ్య మంగళ స్వరూపాన్ని కనులారా తిలకించి పూజా ద్రవ్యాలు సమర్పించి మంగళ హారతులు, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
నేడు చక్రస్నానం: దేవునికడప శ్రీ లక్ష్మి వెంకటేశ్వరస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం దేవునికడప మాడవీధుల్లో భక్తులు, ఆలయ నిర్వాహకులు, అర్చక బృందాలు వసంతోత్సవం నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి ఆలయం ఎదుట గల పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహించనున్నారు. రాత్రి హంస వాహనంపై స్వామిని మాడవీధుల్లో ఊరేగిస్తారు. 8.00 నుంచి 9.00 గంటల్లోపుగా ధ్వజావరోహణం చేస్తారు.


