ప్రధాన కాలువకు మోక్షం ఎప్పుడు?
1.74 లక్షల ఎకరాల సాగు ఎప్పుడు
గత టీడీపీ పాలన, ప్రస్తుత కూటమి పాలనలో ప్రాజెక్టుల పనుల తీరును పరిశీలిస్తే..అప్పుడు–ఇప్పుడు ఒకే పరిస్థితి నెలకొంది. కోస్తా, ఉత్తరాంధ్ర, ఆంధ్రా ప్రాంతంలోని ప్రాజెక్టుల పూర్తికి గడువును నిర్దేశిస్తుండగా రాయలసీమ ప్రాజెక్టులను నిర్దిష్ట గడువులోగా పూర్తి చేస్తా మని ఒక్క ప్రకటన లేదు. కేవలం కాగితాలపై సమీక్షలు మినహాయిస్తే క్షేత్రస్థాయిలో పనితీరు పేలవం. చంద్రబాబు ప్రభుత్వం రాగానే అడివిపల్లె రిజర్వాయర్‌కు ఆర్నెళ్లలో నీళ్లిస్తామని మంత్రి నిమ్మల ప్రకటించి ఏడాదిన్నర దాటింది. తాజాగా నగరి పర్యటనలో చంద్రబాబు చిత్తూరుకు జూన్‌లో కష్ణా జలాలు ఇస్తామని ప్రకటించారు. పనులు పూర్తి చేయించకనే ఇదేలా సాధ్యమం? ఈ హామీ ఒట్టిదేనా అనిపిస్తుంది.
మదనపల్లె: శ్రీసత్యసాయిజిల్లా నుంచి జిల్లాలోని ఎన్‌పీకుంట మండలం నుంచి జిల్లాలోని గాలివీడు మండలం మడుగువారిపల్లె హంద్రీ–నీవా సాగు, తాగు నీటి ప్రాజెక్టు ప్రధాన కాలువ మొదలై పెద్దమండ్యం నుంచి చిన్నమండెం, కలకడ, కేవిపల్లె మండలం వరకు సాగుతుంది. ఈ కాలువ మార్గంలో కిలోమీటర్ 523 నుంచి శ్రీనివాసపురం రిజర్వాయర్‌కు 1.02 టిఎంసీల నీటిని తరలిస్తారు. ఈ కాలువ సాగుతూ కేవీపల్లి మండలంలోని 1,814 టీఎంసీల నీటి సామర్థ్యం కలిగిన అడివిపల్లె రిజర్వాయర్‌కు చేరి ముగుస్తుంది. అడివిపల్లి నుంచి నీవా ఉపకాలువ మొదలై చిత్తూరు వరకు వెళ్తుంది. ఈ మధ్యలో కాలువలో జరగాల్సిన పెండింగ్ పనులును గత టీడీపీ ప్రభుత్వంలోనే నిలిపివేయించారు. అప్పటినుంచి ఈ పనుల జోలికి వెళ్లలేదు. ఇప్పుడేమో నిమ్మల అడివిపల్లెకి ఆరునెలల్లో నీళ్లిస్తామని ప్రకటించి వదిలేశారు. శనివారం నగరి పర్యటనలో చంద్ర బాబు జూన్‌లో చిత్తూరుకు కష్ణా జలాలను తరలిస్తా మని ప్రకటించారు. దీనిపై ప్రాజెక్టు అధికార యంత్రాంగం ఆలోచనలో పడింది. చంద్రబాబు చెప్పిన ట్టు జూన్‌లో నీళ్లు ఎలా ఇవ్వగలమని అంటున్నారు.
పనులు ఆపేసి నీటికి బ్రేక్
టీడీపీ పాలనలో చంద్రబాబు జిల్లాలోని ప్రధాన కాలువ, నీవా ఉపకాలువ పనులను ఆపివేయించారు. పనులు ముందుకు జరగనివ్వలేదు. 2019 మార్చిలో వీటి పనులు పూర్తిగా ఆగిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో కష్ణా జలాలు తరలింపు ఎలా సాధ్యమో చెప్పడం లేదు. ఇప్పటికిప్పుడు పనులు చేపట్టే పరిస్థితులు కనుచూపుమేరలో లేదు. హాంద్రీ–నీవాపై చిత్తశుద్ది కనబర్చడం లేదు. ప్రధాన కాలువకు సంబంధించి రూ.452.85 కోట్ల పనిలో వైఎస్.రాజశేఖర్‌రెడ్డి హాయాంలోనే అత్యధిక పనులు పూర్తయ్యాయి. 2019 మార్చినాటికి 429 కోట్ల పనులు పూర్తయింది. 70 కిలో మీటర్ల కాలువలో పనిలో 800 మీటర్లు చిన్నమండెం, కలకడ మండలాల్లో ఆగిపోయింది. నీవా ఉప కాలువ అడివిపల్లి రిజర్వాయర్ ఉన్న తీర్థంవారిపల్లి నుంచి చిత్తూరుజిల్లా బంగారుపాళెం మండలంలోని తట్రబండ వరకు కాలువ సాగుతుంది. ఈ పనిని రూ.270 కోట్లతో చేపట్టగా రూ.228 కోట్ల పని పూర్తయినా మిగిలిన పని పూర్తి చేయించకుండా గత టిడిపిపాలనలో చంద్రబాబు నిలిపివేయించారు.
రూ.925 కోట్ల అంచనాతో
ప్రధాన కాలువలో రూ.23 కోట్లు, నీవా ఉపకాలువలో రూ.42 కోట్ల పనులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ రూ.65 కోట్ల పనులకు ప్రస్తుతం ప్రభుత్వం రూ.925 కోట్లకు అంచనాలు పెంచుకుంది. అసంపూర్తి పనులతో పాటు కాలువకు లైనింగ్ పేరుతో ప్రతిపాదన వెళ్లింది. ఇందులో ప్రధాన కాలువ పనులు, లైనింగ్‌కు రూ.420.76 కోట్లు, నీవా ఉపకాలువ అసంపూర్తి పనులు, లైనింగ్‌కు రూ.504.55 కోట్లతో అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. దీనికి అనుమతి ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
నీళ్లు వచ్చేలా చేసిన జగన్
ఉమ్మడి వైఎస్సార్‌కడప, చిత్తూరుజిల్లాలు (ప్రస్తుత అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి)లకు కష్ణా జలాలు అందించాలంటే ప్రధాన కాలువపై కీలకమైన టన్నల్ నిర్మాణం ఉంది. శ్రీసత్యసాయి–అన్నమయ్యజిల్లా సరిహద్దులోని ఎన్‌పీ కుంట మండలం పెద్దరాంపల్లె–పుల్లకూరవాండ్లపల్లె సొరంగం పనులను గత టిడిపి ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసి వదిలేసింది. వైఎస్.జగన్ సీఎం అయ్యాక పూర్తి చేయించారు.
● ప్రధాన కాలువపై కిలోమీటర్ 412 నుంచి 415 వరకు టన్నల్ పూర్తి చేయాల్సివుంది. 2015 మార్చినాటికి రూ.6.34 కోట్ల పనులతో కాంట్రాక్టు సంస్థ పనులు వదులుకుంది. ఈ పనుల అంచనా పెంచిన గత టిడిపి ప్రభుత్వం పనులు చేయించలేకపోయింది. వైఎస్.జగన్ సీఎం కావడంతో 2021లో పనులు పూర్తి చేయించారు. దీనితో ఈ ప్రధాన కాలువకు కదిరి సమీపంలోని చెర్లోపల్లె రిజర్వాయర్ నుంచి లేదా జీడిపల్లి రిజర్వాయర్ నుంచి కష్ణా జలాలను తరలించి శ్రీనివాసపురం రిజర్వాయర్‌కు తరలించడానికి అటంకాలు లేవు. అయినా ఇంతవరకు చుక్కనీటిని పారించలేదు.
పెద్దమండ్యం మండలంలో సాగే హంద్రీ–నీవా ప్రధాన కాలువ అసంపూర్తి పనులు, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలోనే పూర్తయిన అడివిపల్లి రిజర్వాయర్
ప్రధాన కాలువపై ఆధారపడి నిర్మించిన తంబళ్లపల్లె ఉపకాలువ, చింతపర్తి డిస్ట్రబ్యూటరీ, ఎల్లుట్ల డిస్ట్రిబ్యూటరీ, నీవా ఉపకాలువ, సదుం డిస్ట్రిబ్యూటరీల కింద, అడివిపల్లి, శ్రీనివాసపురం రిజర్వాయర్ల కింద 1,74,150 ఎకరాల ఆయకట్టును నిర్దేశించారు. ఈ కాలువకు కష్ణా జలాలు తరలిస్తే ఇది సాధ్యమవుతుంది. అయితే ప్రభుత్వం ఈ పనులు పూర్తి చేయిస్తామంటూ కాలయాపన మినహా చేసిందేమిలేదు. ప్రభుత్వం ఇప్పటికై నా కరువు ప్రాంతానికి కష్ణా జలాలు తరలించేలా చర్యలు చేపట్టాలని రైతాంగం కోరుతోంది.
రూ.65 కోట్ల పెండింగ్ పనికి రూ.925 కోట్ల అంచనా
గత టీడీపీ పాలనలో హంద్రీ–నీవా పనులు నిలిపివేత
నీవా ఉపకాలువది ఇదే పరిస్థితి
ఆర్నెళ్లలో అడివిపల్లికి నీళ్లిస్తామని నిమ్మల మాటిచ్చి ఏడాదిన్నరైంది
కాలువలో అసంపూర్తి పనులనుపూర్తి చేయించకపోవడంతో
చుక్కనీరు అందని దుస్థితి
ప్రధాన కాలువకు మోక్షం ఎప్పుడు?


