గర్భిణి ఆత్మహత్యాయత్నం
మదనపల్లె రూరల్ : కుటుంబసమస్యలతో గర్భిణి ఆత్మహత్యకు ప్రయత్నించిన ఘటన సోమవారం మదనపల్లె మండలంలో జరిగింది. బీకే.పల్లెకు చెందిన వెంకటేశ్వరరావు భార్య కల్పన(23) కుటుంబసమస్యలతో మనస్తాపం చెంది ఇంటివద్దే సూపర్ వాస్మోల్ తాగి ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న ఆమె సోదరుడు హుటాహుటిన ఇంటికి చేరుకుని బాధితురాలిని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఐసీయూ విభాగంలో చికిత్సలు పొందుతోంది.
రోడ్డు ప్రమాదంలో
ఏడేళ్ల చిన్నారి మృతి
గాలివీడు : మండల పరిధిలోని ఎగువగొట్టివీడు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో అదే గ్రామానికి చెందిన శైలజ (7) అనే చిన్నారి మృతి చెందింది. గ్రామస్తుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గాలివీడులో మెడికల్ దుకాణం నిర్వహిస్తున్న సంజోద్ అలీఖాన్ సోమవారం ఉదయం తన కుటుంబ సభ్యులతో కలిసి రాయచోటికి కారులో బయలుదేరారు. ఈ క్రమంలో ఎగువగొట్టివీడు వద్దకు రాగానే ప్రధాన రహదారిపై రోడ్డు దాటుతున్న చిన్నారి శైలజను కారు ఢీకొనడంతో తీవ్ర రక్తస్రావంతో కుప్పకూలిపోయింది. వెంటనే చిన్నారి తండ్రి తమటమ్ రామకృష్ణారెడ్డి తన సొంత వాహనంలో శైలజను రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతురాలు తండ్రి రామకృష్ణారెడ్డి దంపతులకు ఐదుగురు సంతానం కాగా, శైలజ మూడవ కుమార్తె. ముక్కుపచ్చలారని చిన్నారి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
టిప్పర్ ఢీకొని
వృద్ధురాలి దుర్మరణం
మదనపల్లె రూరల్ : టిప్పర్ ఢీకొని ఓ వృద్ధురాలు దుర్మరణం చెందిన సంఘటన సోమవారం మదనపల్లెలో జరిగింది. స్థానిక దేవతానగర్‌కు చెందిన రామయ్య భార్య రామసుబ్బమ్మ(65) స్థానికంగా రోడ్డు దాటుతుండగా టిప్పర్ వేగంగా వచ్చి ఢీకొంది. ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే దుర్మరణం పాలైంది. సమాచారం అందుకున్న తాలూకా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి ఘటనపై ఆరా తీశారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. కాగా రామసుబ్బమ్మకు ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు విచారణ చేస్తున్నట్లు తాలూకా సీఐ కళా వెంకటరమణ తెలిపారు.
ఘర్షణ.. ఐదుగురికి గాయాలు
– విద్యుత్‌లైన్‌పై వివాదమే కారణం
నిమ్మనపల్లె : గ్రామంలో కొత్తగా వేస్తున్న విద్యుత్ లైన్‌పై ఇరువర్గాల మధ్య వివాదం ఏర్పడి ఘర్షణ జరిగిన ఘటన సోమవారం సాయంత్రం నిమ్మనపల్లె మండలంలో జరిగింది. రెడ్డివారిపల్లె పంచాయతీ దిన్నెమీద జంగంపల్లెలో విద్యుత్ శాఖ సిబ్బంది రూరల్ విద్యుత్ లైన్ కొత్తగా అమర్చుతున్నారు. అందులో భాగంగా విద్యుత్‌లైన్ కిందనే తాగునీటి బోరు ఉండటంతో గ్రామానికి చెందిన హరిబాబు, మరికొందరు బోరు రిపేరీ సమయంలో పైపులు తీసేందుకు ఇబ్బంది అవుతుందని, లైన్ పక్కకు జరిపివేయాలని కోరారు. అందులో భాగంగా పక్కనే ఉన్న చింతచెట్టును తొలగించి లైన్ వేసేందుకు సిద్ధం చేశారు. చింతచెట్టు తొలగించిన విషయమై రవిబాబు వర్గీయులతో హరిబాబు వర్గీయులకు వివాదం ఏర్పడింది. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు కొడవళ్లు, కర్రలతో దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో రవిబాబు వర్గీయులు హరిబాబు వర్గీయులపై కొడవలి, కర్రలతో దాడికి పాల్పడగా, హరిబాబు(47), ఆయన బంధువు రమేష్(37)కు తలకు తీవ్రగాయాలయ్యాయి. భార్య అరుణమ్మ(37), తండ్రి నారాయణ(80)కు ఫ్రాక్చర్ అయ్యాయి. అన్న సుబ్రహ్మణ్యంకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో మరో వర్గంలోని రవిబాబు(40) తలకు తీవ్ర గాయాలు కాగా, ఆయన అక్క కృష్ణవేణి(50) గాయపడింది. స్థానికుల సహాయంతో ఇరువర్గాల్లో గాయపడిన వ్యక్తులు వేర్వేరుగా మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి చేరుకుని చికిత్సలు పొందారు. నిమ్మనపల్లె పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.
గర్భిణి ఆత్మహత్యాయత్నం
గర్భిణి ఆత్మహత్యాయత్నం


