చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌లను దేవుడే క్షమించాలి
కడప కార్పొరేషన్: తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వులు కలిశాయని విష ప్రచారం చేసి మహాపరాధం చేసిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను ఆ దేవదేవుడు క్షమించాలని వైఎస్సార్‌సీపీ యువజన విభాగం కడప నగర అధ్యక్షుడు గుంటి నాగేంద్ర, వైద్య విభాగం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగార్జునరెడ్డి అన్నారు. సోమవారం తిరుమల తొలి గడప దేవునికడపలో యువజన విభాగం ఆధ్వర్యంలో నల్ల దుస్తులు ధరించి, చెవిలో పువ్వులు పెట్టుకొని శాప విముక్తి దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా పొర్లు దండాలు పెట్టి, గుంజీలు తీసి వినూత్న రీతిలో నిరసన చేశారు. అనంతరం గుంటి నాగేంద్ర మాట్లాడుతూ కులమతాల మధ్య చిచ్చు పెట్టాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు, పవన్ కల్యాణ్ శ్రీవారి లడ్డూ ప్రసారంపై దుష్ప్రచారం చేసి, ఆ నెపాన్ని మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై వేయాలని చూశారన్నారు. ఇప్పుడు సిట్ అధికారులు సుప్రీం కోర్టులో వేసిన అఫిడవిట్ ద్వారా ఆ లడ్డూలో జంతువుల కొవ్వు కలవలేదని తేటతెల్లమైందన్నారు. ఇప్పటికై నా వారు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వెంకటేశ్వరస్వామి భక్తులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. డాక్టర్ నాగార్జునరెడ్డి మాట్లాడుతూ 2024 ఎన్నికల్లో కూటమికి 164 సీట్లు, వైఎస్సార్‌సీపీకి 11 సీట్లు రావడంతో ప్రజలు అయోమయానికి గురయ్యారన్నారు. వారిని డైవర్ట్ చేయడానికి సీఎం చంద్రబాబు తిరుమల లడ్డులో కల్తీ నెయ్యి కలిసిందని ఆరోపణలు చేసి హిందువుల మనోభావాలను దెబ్బతీశాన్నారు. ఇప్పటికై నా సీఎం, డిప్యూటీ సీఎం, టీడీపీ నేతలు ప్రజలకు క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాయాలన్నారు. అబద్ధాలకు ఆయువు తక్కువ, సత్యం ఎప్పటికై నా వర్ధిల్లుతుందని మరోసారి నిజమయ్యిందన్నారు. అందుకే మహాపరాధం చేసిన వీరిని దేవుడు క్షమించాలని శాప విముక్తి దీక్ష చేపట్టినట్లు వివరించారు. వైఎస్సార్‌టీయూసీ రాష్ట్ర అధికార ప్రతినిధి సుదర్శన్ రాయల్ మాట్లాడుతూ తిరుమల లడ్డులో కల్తీ జరిగిందని దుర్గమ్మ గుడి మెట్లు కడిగిన డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్, ఇప్పుడు కల్తీ జరగలేదని తెలిసింది కాబట్టి అలిపిరి మెట్లు కడిగి క్షమాపణ కోరాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ ఎస్సీసెల్ నగర అధ్యక్షుడు కంచుపాటి బాబు, నాయకులు రామక్రిష్ణ, రవి, నరసింహ పాల్గొన్నారు.
తిరుమల లడ్డూపై వారు విష ప్రచారం చేసి అపరాధం చేశారు
దేవునికడపలో శాప విముక్తి దీక్ష చేపట్టిన వైఎస్సార్‌సీపీ నాయకులు


